లోగుట్టు దసాల్ట్ కెరుక..

లోగుట్టు దసాల్ట్ కెరుక..

నిన్న లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల ఒప్పందంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒప్పంద గోపనీయతపై అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు వింటుంటే ఎవరు చెప్పేది నిజమో.. ఎవరిది అబద్ధమో తేల్చుకోలేని అయోమయం కలుగుతోంది. ఈ రాఫెల్ చిదంబర రహస్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకోవాల్సి వస్తోంది.

ఒప్పందం వివరాలు బయటపెట్టడానికి తమకే అభ్యంతరం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ తనతో స్వయంగా చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ విమానాల వ్యవహారంలో ఎలాంటి రహస్య ఒప్పందాలు చేసుకోలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారన్నారు. ఆ సమయంలో తనతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నట్టు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ఒత్తిడి కారణంగా రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ దేశప్రజలకు అబద్ధాలు చెబుతున్నారన్నది రాహుల్ ఆరోపణ.

లోక్ సభలో రాహుల్ గాంధీ వివాదాస్పద ఆరోపణ చేసిన కొద్ది గంటల్లోనే ఫ్రాన్స్ తన వివరణ విడుదల చేసింది. 2008లో భారత్-ఫ్రాన్స్ ల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం కొనుగోలు వ్యవహారాలు గోపనీయంగా ఉంచామని.. అందుకు అనుగుణంగానే  23 సెప్టెంబర్ 2016లో 36 రాఫెల్ యుద్ధవిమానాలు, వాటి ఆయుధసామాగ్రి కొనుగోలు ఒప్పందం కుదిరినట్టు తెలిపింది. ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఫ్రాన్స్ ప్రభుత్వం నష్టనివారణగా వివరణ ప్రకటన విడుదల చేసినట్టు భావిస్తున్నారు.

అయితే ఇప్పడు ప్రశ్న ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? యుపీఏ-2 హయాంలో కుదిరిన ఒప్పందం ధరకు మూడింతలు ఎక్కువ చెల్లిస్తున్నారన్న రాహుల్ ఆరోపణ నిజమా? లేక ఎక్కువ వెల చెల్లిస్తూ గోపనీయత పేరుతో మోడీ ప్రభుత్వం దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందా? చూస్తుంటే తాజా ఒప్పందంలోనే ఏవో లొసుగులు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 2008 నాటి ఒప్పందాన్ని పరిశీలిస్తే అందులో సాంకేతికత, ఆయుధాలు, టెక్నాలజీ బదలాయింపు వంటి కీలక అంశాలు కచ్చితంగా గోప్యంగా ఉంచాల్సినవే. కానీ ధరను ఎందుకు దాచాలన్నదే ప్రశ్న.

2008 ఒప్పందం ప్రకారం రాఫెల్ యుద్ధవిమానాలను తయారుచేసే డసాల్డ్ కంపెనీ 36 విమానాలను భారత్ కి అందించాలి. ఇందుకోసం రూ.58,000 కోట్లు చెల్లించడానికి భారత్ అంగీకరించింది. విమానాలతో పాటు భారత్‌కు చెందిన డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్‌ తదితర సంస్థలతో విమానాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దసాల్డ్ అందజేయాలి. ఇందులో ధర దాచిపెట్టాలన్న నిబంధన లేదు. అందుకే యుపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రాఫెల్ ధరను సభాముఖంగా ప్రకటించారు. కానీ తాజాగా కుదిరిన ఒప్పందంలో ధరను కూడా గోపనీయత పరిధిలో చేర్చారు.

ఇక్కడ తమాషా ఏంటంటే రాఫెల్ యుద్ధవిమానాలు తయారుచేసే డసాల్డ్ ఏవియేషన్ ఏటా తన లాభనష్టాల ఖాతాను ప్రకటిస్తూ వస్తోంది. ఆదాయవ్యయాల ఖర్చుల్లో మన దేశానికి అమ్మకాల ద్వారా వచ్చే మొత్తాన్ని తెలుపుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ కి36 రాఫెల్ విమానాల అమ్మగా 7.5 బిలియన్ డాలర్లు (ఒక్కో విమానం ఖరీదు రూ.1,670 కోట్లు) ఆర్జించినట్టు చెప్పింది. 11 నెలల ముందు అవే విమానాలను ఈజిప్ట్, ఖతర్ లకు ఒక్కోటి రూ.1,319 కోట్ల చొప్పున అమ్మినట్టు తెలిపింది.

యూపీఏ హయాంలో ఒక్కో విమానం ధర రూ.520 కోట్లుగా నిర్ణయిస్తే ఇప్పుడు అంతకు మూడు రెట్లు చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌, తాజా ఒప్పందం వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తోంది.