రిలయన్స్ త‌ర‌ఫున మోడీ లాబీయింగ్‌.. కీల‌క ప‌త్రాలు వెల్ల‌డి ! 

రిలయన్స్ త‌ర‌ఫున మోడీ లాబీయింగ్‌.. కీల‌క ప‌త్రాలు వెల్ల‌డి ! 

సుప్రీం కోర్టు రాఫెల్ వివ‌రాలు కోరిన నేప‌థ్యంలో మోడీ ప్ర‌భుత్వం ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ర‌క్ష‌ణ మంత్రి నిర్మాలా సీతారామ‌న్ ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డి మీడియా ఈ డీల్‌కు సంబంధించి అత్యంత కీల‌క‌స‌మాచారాన్ని వెలుగులోకి తెచ్చింది. రిల‌య‌న్స్ త‌ర‌ఫున మోడీ ప్ర‌భుత్వం లాబీయింగ్ చేసింద‌ని మీడియా పార్ట్ వెల్ల‌డించింది. ఈ డీల్ విష‌యంలో మోడీ ప్ర‌భుత్వం ఒత్తిడి తెచ్చింద‌ని ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు హోలాండ్ అన్న‌ట్లు ఈ పత్రికే రాసింది. ఇపుడు తాజా సాక్ష్యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. 36 రాఫెల్‌ విమానాల ఒప్పందం కుదరాలంటే అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ డిఫెన్స్‌ (ఆర్‌డీ)సంస్థను ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ఒప్పుకోవాల్సిందేనని ఈ కంపెనీ ముందుగానే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన స‌మాచారాన్ని మీడియా పార్ట్ బ‌య‌ట‌పెట్టింది.  డీల్ త‌మ సొంతం కావాలంటే  రిలయన్స్‌తో జ‌త క‌ట్ట‌డం త‌ప్ప‌ద‌ని  దసో ఏవియేషన్ అంతర్గత డాక్యుమెంట్లు వెల్ల‌డిస్తున్నాయి.  ‘‘ఈ కాంట్రాక్ట్ ద‌క్కాలంటే రిలయన్స్‌ను అంగీకరించ‌క త‌ప్ప‌దు.  ఇది ఒక వాణిజ్యపరమైన రాజీ’’ అని దసో డిప్యూటీ సీఈవో లోయిక్‌ సెగాలెన్‌ 2017 మే 11వ తేదీన నాగ్‌పూర్‌లో దసో ప్రతినిధులకు ఆ అధికారి చెప్పినట్లు, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నట్లు మీడియాపార్ట్‌ లో తాజాగా ప్రచురితమైన కథనం వెల్లడించింది. సెగాలెన్‌ దసో సంస్థలో అధికార శ్రేణిలో రెండో స్థానంలో ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి.  దసో సంస్థ కూడా తమకు తాముగా అనిల్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందని వివరణ ఇచ్చినా దాని వెనుక మోడీ ప్ర‌భుత్వం ఒత్తిడి ఉన్నట్లు ఈ కథనం స్ప‌ష్టం చేస్తోంది.