డేటా చోరీ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ 

డేటా చోరీ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ 

డేటా చోరీ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ వేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్ర, కుతంత్రం అన్నీ ఆధారాలతో సహా దొరికాయని చెప్పారు. చరిత్రలో చాలా కుట్రలు చూశానన్నారు. కానీ స్వాతంత్రం తర్వాత ఇలాంటి కుట్రలు మాత్రం చూడలేదని వ్యాఖ్యానించారు. అయినా దొంగతనం చేసిన వారు దొరక్కుండాపోరని చెప్పారు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై దాడులు చేయడం చట్ట విరుద్ధమన్నారు. డేటా మొత్తం దొంగిలించుకుని పోయారని ఆరోపించారు. అంతేకాకుండా సేవా మిత్ర, ఇన్సూరెన్స్‌ సమాచారం ఎత్తుకెళ్లారని ధ్వజమెత్తారు.
 
తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఇది లూటీలు చేసే డెకాయిట్‌ ప్రభుత్వమా?, ఎవరు కంప్లైంట్‌ ఇచ్చారో, ఎక్కడ ఇచ్చారో చెప్పలేదన్నారు. కంప్లైంట్‌ ఇవ్వకుండా దొంగతనానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ డేటా పోతే మాకు ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. పైగా మా డేటా దొంగిలించి మాపైనే కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు కూడా తెలియకుండా కుట్రలు చేశారని పేర్కొన్నారు. ఇదంతా విజయసాయిరెడ్డి డైరెక్షన్‌లో తెలంగాణ పోలీసుల కుట్ర పన్నారని ఆరోపించారు. ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌లో దినేష్‌రెడ్డితో ఎందుకు కంప్లైంట్‌ ఇప్పించారని అన్నారు. ఐటీ గ్రిడ్‌పై కంప్లైంట్‌కు ముందు దాడులు చేసినట్లు సిట్‌కు నేత‌ృత్వం వహిస్తున్న స్టీఫెన్‌ రవీంద్ర కూడా ఒప్పుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.