డేటా చౌర్యం కేసు: నేడు సిట్‌ ముందుకు అశోక్‌?

డేటా చౌర్యం కేసు: నేడు సిట్‌ ముందుకు అశోక్‌?

డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ బుధవారం తెలంగాణ సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్ విచారణకు హాజరవుతాడా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ కేసు దర్యాప్తు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌, బ్లూఫ్రాగ్‌ సంస్థల యజమాని అశోక్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి పోలీసులు సోదాలు చేసారు. ఆ సమయంలో పోలీసులు ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. డేటా చౌర్యానికి సంబంధించి తదుపరి విచారణలో భాగంగా అశోక్‌కు ఈనెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరుకావాలని వీటిలో పేర్కొన్నారు. అయితే అశోక్‌ అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో నోటీసులకు స్పందించలేదు. తాజాగా సోమవారం కేపీహెచ్‌బీలోని ఆయన ఇంటికి నోటీసులు పంపారు. గోషామహల్‌లోని సిట్‌ కార్యాలయంలో బుధవారం హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ రోజు సిట్ విచారణకు అశోక్ హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ హాజరుకాకపోతే సిట్‌ అధికారులు అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతారు.