హైదరాబాదీలకు వార్నర్ భావోద్వేగమైన సందేశం

హైదరాబాదీలకు వార్నర్ భావోద్వేగమైన సందేశం

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాదీలకు, సన్‌రైజర్స్‌ అభిమానులకు భావోద్వేగ సందేశాన్నిచ్చాడు. ప్రపంచకప్‌ జట్టు సన్నాహకంలో భాగంగా సొంత జట్టుతో కలవడానికి స్వదేశం వెళ్లిన వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సుదీర్ఘ పోస్టుతో అభిమానులకు గుడ్‌బై చెప్పాడు. ‘మీరు చూపిన ప్రేమకు, మద్దతుకు ఏవిధంగా కృతజ్ఞత చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఈ ఏడాదే కాదు.. గతేడాది నేనున్న గడ్డుకాలంలో కూడా మీరు మద్దతుగా నిలిచారు. మళ్లీ సన్‌రైజర్స్‌ కుటుంబంలో చేరడానికి, మీతో కలిసి ఆడటానికి.. మీ దగ్గరకు రావడానికి ఎంతో ఎదురు చూశాను. ఫ్రాంచైజీ యాజమాన్యం, ఆటగాళ్లు, సోషల్‌ మీడియా విభాగం, అభిమానులు నా పునరాగమనానికి ఘనస్వాగతం పలికారు. మీతో ఆడటం నేను ఎంతో ఆస్వాదించాను. మిగిలిన టోర్నీలో అంతా మంచే జరగాలని, మంచిఫలితం దక్కాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నాడు. సోమవారం కింగ్స్‌ పంజాబ్‌తో ఆఖరి మ్యాచ్‌ ఆడిన వార్నర్‌ (56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దుమ్మురేపిన సంగతి తెలిసిందే. చెలరేగి ఆడిన వార్నర్ సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలిపాడు.