హైదరాబాద్ లో కూతురితో ఆటో ఎక్కిన వార్నర్ 

హైదరాబాద్ లో కూతురితో ఆటో ఎక్కిన వార్నర్ 

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా గత ఐపీఎల్ లో ఆడలేకపోయిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్-12 సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్ హెచ్) జట్టు తరఫున ఆడుతున్నాడు. తన అదరగొట్టే బ్యాటింగ్ తో హైదరాబాద్ జట్టుకి విజయాలు సాధించి పెడుతున్నాడు. ప్రస్తుతం పాయింట్ల టేబుల్ లో సన్ రైజర్స్ టీమ్ ఆరు పాయింట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది. హైదరాబాద్ టీమ్ ఏప్రిల్ 8న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఎస్ఆర్ హెచ్ జట్టు తన తర్వాత మ్యాచ్ ఏప్రిల్ 14న ఢిల్లీ కేపిటల్స్ తో ఆడనుంది. దాదాపు ఐదారు రోజుల విరామం దొరకడంతో జట్టు ఆటగాళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తన స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఒక వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆస్ట్రేలియా క్రికెటర్ తన నాలుగేళ్ల పాపతో కలిసి హైదరాబాద్ లో ఆటో ఎక్కి చక్కర్లు కొడుతున్నాడు. ఈ వీడియోలో వార్నర్ కూతురు కూడా చక్కగా పోజులిచ్చి బై చెబుతోంది.

ఐపీఎల్ 2016లో సన్ రైజర్స్ జట్టుకి కెప్టెన్ గా ఉన్న వార్నర్ టైటిల్ సాధించి పెట్టాడు. గత ఏడాది చర్చల్లో నిలిచిన బాల్ ట్యాంపరింగ్ వివాదంలో తన పాత్ర కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లను అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ వ్యవహారంలో ఆస్ట్రేలియా మరో క్రికెటర్ కెమరాన్ బ్యాన్ క్రాఫ్ట్ పై తొమ్మిది నెలల ఆంక్షలు విధించడం జరిగింది. గత ఐపీఎల్ సీజన్ లో వార్నర్, స్మిత్ లపై బీసీసీఐ నిషేధం విధించడంతో వాళ్లిద్దరూ ఆడలేకపోయారు. 

ఐపీఎల్ ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకు 349 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం వార్నర్ దగ్గరే ఉంది. ఐపీఎల్ గత సీజన్ లో సన్ రైజర్స్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.