శ్రావణి కేసులో కీలక విషయాలు.. ఆ ముగ్గురూ నమ్మించి మోసం చేశారు..!

శ్రావణి కేసులో కీలక విషయాలు.. ఆ ముగ్గురూ నమ్మించి మోసం చేశారు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బుల్లి తెర న‌టి శ్రావ‌ణి ఆత్మహ‌త్య కేసులో ఇద్దరు నిందితుల‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన డీసీపీ ఏఆర్ శ్రీనివాస్.. ఈ కేసులో సాయి కృష్ణారెడ్డిని ఏ1గా, అశోక్ రెడ్డిని ఏ2గా, దేవ‌రాజ్ రెడ్డిని ఏ3గా గుర్తించామ‌న్నారు. ఇప్పటికే సాయికృష్ణారెడ్డి, దేవ‌రాజ్‌ను అరెస్టు చేశామ‌ని, త్వరలోనే అశోక్ రెడ్డిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తామ‌న్నారు.ఈ కేసులో శ్రావ‌ణి త‌ల్లిదండ్రుల‌ను నిందితులుగా చేర్చడానికి కుద‌ర‌దు అని స్పష్టం చేశారు డీసీపీ.

శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించామని.. 2012లో నగరానికి వచ్చాక సాయి కృష్ణారెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది... మూడేళ్ల తర్వాత నిర్మాత అశోక్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాతే దేవరాజ్ పరిచయం అయ్యాడని వెల్లడించారు డీసీపీ శ్రీనివాస్.. అయితే, శ్రావణి పేరెంట్స్ దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని హెచ్చరించారని చెప్పారు.. ఆత్మహత్యకు ముందు శ్రావణి మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ సేకరించామని.. ముగ్గురూ తనను వేధించారని శ్రావణి ఆడియోలో పేర్కొందన్నారు. అంతే కాదు.. దేవరాజ్ తో సంబంధం ఉన్న అమ్మాయిలు అంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు డీసీపీ.. మరోవైపు.. సాయి కృష్ణారెడ్డి , అశోక్ రెడ్డి లు ఇద్దరూ తనను వేధింపులకు గురి చేస్తున్నారు అని శ్రావణి చివరి ఆడియోలో ఉందని.. అందుకే.. ఈ కేసులో ఏ1గా సాయి కృష్ణా రెడ్డి , ఏ2గా అశోక్ రెడ్డి, ఏ3గా దేవరాజ్ రెడ్డిని చేర్చామన్నారు. అయితే, ఆ ముగ్గురు ఏదో ఒక సంద‌ర్భంలో ఆమెను పెళ్లి చేసుకుంటామ‌ని న‌మ్మించారు. ఆ త‌ర్వాత ప‌లు విధాలుగా వేధింపులకు గురిచేశారని.. ముగ్గురి బాధ‌లు భ‌రించ‌లేక‌నే శ్రావ‌ణి ఆత్మహ‌త్య చేసుకుంద‌ని భావిస్తున్నామ‌ని తెలిపారు డీసీపీ.