మందుబాబులూ..బీ కేర్ ఫుల్ బ్రదరూ...

మందుబాబులూ..బీ కేర్ ఫుల్ బ్రదరూ...

ఆల్కహాల్ ప్రతి రోజూ తాగుతారా.. వారానికోసారి తాగుతారా? లేక సందర్భాన్ని బట్టి తాగుతారా? కేటగిరీ ఏదైనా రిస్క్ మాత్రం ఫేస్ చేయక తప్పదు. మద్యాన్ని ఒక్క చుక్క తీసుకున్నా విషమేనని, ఏటా ఆల్కహాల్ ఎంత మందిని పొట్టన పెట్టుకుంటుందో తెలిస్తే మళ్లీ దానికి జోలికి కూడా  వెళ్లరేమోనని తాజా అధ్యయనం చెబుతోంది. ఆ వివరాలు చూడండి.

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ "గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజెస్" పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఓ అధ్యయనం నిర్వహించింది. దాని ప్రకారం.. 
1) 2016లో ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల మరణాలు కేవలం ఆల్కహాల్ వల్లే సంభవించాయి. 
2) ఆల్కహాల్ సేవించేవారిలో అకాల మరణాలు సంభవిస్తున్నాయి. మందుబాబుల్లో 50 ఏళ్లు నిండకుండానే వివిధ శరీర భాగాలు పనిచేయడం మానేస్తున్నాయి. అందువల్లే చిన్నవయసులోనే పక్షవాతం వంటివి సంభవిస్తూ అతి తొందరగా మృత్యువుకు చేరువవుతున్నారు. 
3) ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 శాతం మరణాలు మందుబాబుల్లోనే సంభవిస్తుండడం అప్రమత్తం కావాల్సిన అంశం.
4) మద్యం తాగే అలవాటు 50 ఏళ్ల తరువాత కూడా కొనసాగించేవారు క్యాన్సర్ బారిన పడుతున్నారు. 
5) ప్రతి 13 మంది బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో ఒకరికి ఆల్కహాల్ వల్లే ఆ వ్యాధి సోకిందని యూకేలో జరిగిన అధ్యయనంలో తేలింది. 
6) ప్రపంచం మొత్తమ్మీద మహిళల్లో 27.1 శాతం మరణాలు,  పురుషుల్లో 18.9 శాతం మరణాలు ఆల్కహాల్ వల్లే సంభవిస్తున్నాయి. 
7) ప్రపంచంలో మూడు వంతుల మంది అంటే 2.4 బిలియన్ ప్రజలు ఆల్కహాల్ కు అలవాటు పడిపోయారు. 
8) ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మహిళలు, 39 శాతం పురుషులు తాగుబోతులే.
9) అత్యధిక తాగుబోతులున్న దేశంగా డెన్మార్క్ నమోదవగా.. అత్యల్ప తాగుబోతుల దేశంగా పాకిస్థాన్ నమోదైంది. 

ఆల్కహాల్ అందమైన మృత్యువు:
సిగరెట్, పొగాకు, గుట్ఖా వంటి ప్రోడక్ట్స్ పట్ల విపరీతంగా అలర్ట్ చేసే ప్రభుత్వాలు గానీ, సంస్థలు గానీ ఆల్కహాల్ గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో దీని మీద ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందని స్టడీ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. పరిమిత స్థాయిలో ఆల్కహాల్ పుచ్చుకుంటే ఆరోగ్యానికి మేలే చేస్తుందన్న అభిప్రాయాలు కూడా తప్పని వారు తేల్చేశారు. లిక్కర్ ఒక్క చుక్కయినా సరే.. అది విషంతోనే సమానమని సమగ్ర అధ్యయనం ద్వారా నిరూపించారు. అయితే డయాబెటిస్, గుండెపోటు వంటి ఒకటి, రెండు అంశాల్లో ఆల్కహాల్ స్వల్పంగా మేలు చేసిందని.. మిగతా అన్ని సందర్భాల్లోనూ ఇది రాక్షసిలాంటిదేనని తేల్చారు. 

ప్రమాద ఘంటికలకు పరిష్కారమేంటి?
గ్లోబల్ స్టడీ సూచిస్తున్న టాప్ మోస్ట్ పరిష్కారమేంటంటే.. అన్ని దేశాలూ దీన్ని బ్యాన్ చేయాలని. అయితే అలాంటి ప్రయోగాలు గతంలో ఫెయిలైన ఉదంతాల్ని బట్టి.. ఆల్కహాల్ పై నియంత్రణ పెంచాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ అమ్మకాల సమయాన్ని తగ్గించడం, ప్రజలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం, ధరలు పెంచడం, ఆల్కహాల్ వినియోగించేవారి గరిష్ట వయసును పెంచడం.. ఇలా చేసినట్టయితే ఆల్కహాల్ సేవించేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని వారు సూచిస్తున్నారు. 

Photo Courtesy: Fairfax County