ఇరాక్ లో మునిగిన పడవ, 100 మంది మృతి

ఇరాక్ లో మునిగిన పడవ, 100 మంది మృతి

ఇరాక్ లోని టైగ్రిస్ నదిలో పడవ మునిగి దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కుర్దులు నౌరుజ్ అనే పండుగను జరుపుకునేందుకు వేలాది మంది టైగ్రిస్ నది సమీపంలోకి చేరుకున్నారు. ఉమ్ రబేయిన్ ద్వీపానికి పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు నదిలో వేరే పడవలు ప్రయాణించకపోవడంతో బాధితులను రక్షించే అవకాశం లభించలేదని, దీంతో మృతుల సంఖ్య పెరిగిందని తెలిపారు. పడవలో సుమారు 200 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు గుర్తించామన్నారు. మృతుల్లో 61మంది మహిళలు, 19 మంది చిన్నారులు ఉన్నారు. ఇందులో 55 మందిని రక్షించామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని సహాయక సిబ్బంది తెలిపారు. మోసుల్ డ్యామ్ నంచి ఇటీవలే నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం టైగ్రిస్ నదిలో నీటి ప్రవాహం పెరిగిందని హెచ్చరికలు జారీ చేసిన పడవ నిర్వాహకులు పట్టించుకోలేదని అధికారులు తెలిపారు.