రూ. 4 చొప్పున పెరగనున్న పెట్రోల్‌ ధర

రూ. 4 చొప్పున పెరగనున్న పెట్రోల్‌ ధర

కర్ణాటక ఎన్నికల సమయంలో  పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంచకుండా ఆపినందుకు వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రెడీ అవుతున్నాయి. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే  పెట్రోల్‌ ధర 69పైసలు, తరవాతి రోజు 22 పైసలు పెంచిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు... ఎన్నికల సమయంలో అంటే 19 రోజుల పాటు ధరలు పెంచకుండా ఆపినందుకు భారీగా నష్టపోతున్నాయి. ఈ నష్టాన్ని రానున్న వారాల్లో భర్తీ చేసుకోవాలని బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీలు సిద్ధమౌతున్నాయి. 'మా  అంచనా ప్రకారం డీజిల్‌ ధరను లీటరుకు రూ. 3.5 నుంచి రూ.4 వరకు, పెట్రోల్‌ ధరను రూ. 4 లేదా రూ. 4.55 మేరకు పెంచే అవకాశముంద'ని కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీ పేర్కొంది, దీనికి సంబంధించి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.  ఇలా చేస్తేనే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తమ గ్రాస్‌ మార్జిన్‌ను కాపాడుకోగలుగుతాయని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ కంపెనీలు లీటరుకు రూ. 2.7 చొప్పున గ్రాస్‌ మార్జిన్‌తో పెట్రో ఉత్పత్తులను అమ్ముతాయి. ఈ లెక్కలన్నీ డాలర్‌, చమురు ధరలు స్థిరంగా ఉంటేనే.