వరల్డ్ కప్ కి ముందు సిరీస్ ఓటమి టీమిండియాకో హెచ్చరిక

వరల్డ్ కప్ కి ముందు సిరీస్ ఓటమి టీమిండియాకో హెచ్చరిక

ప్రపంచ కప్ కి ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ని 2-3తో కోల్పోవడం విరాట్ కోహ్లీ అండ్ కంపెనీకి ఓ హెచ్చరికని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ అయిన భారత జట్టు ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ చేతుల్లో మిగిలిన మూడు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ చేజార్చుకుంది. ఇంగ్లాండ్ లో మే 30 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్ కి ముందు భారత్ ఆడిన చిట్టచివరి 50 ఓవర్ల టోర్నమెంట్ ఇదే.

'మనం అక్కడి వెళ్లి సునాయాసంగా ప్రపంచ కప్ గెలుచుకొస్తామని నాకు అనిపించింది. అందువల్ల ఏం జరిగినా మంచికే జరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ మనం వరల్డ్ కప్ గెలవాలంటే చాలా బాగా ఆడాల్సి ఉంటుందని గుర్తు చేసిందని' రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

ఇవాళ రాహుల్ ఈఎస్పీఎన్ క్రికిన్ఫో 'సూపర్ స్టాట్స్' లాంచ్ చేయడానికి తన పాత సహచరుడు సంజయ్ మంజ్రేకర్ తో హాజరయ్యాడు. ప్రస్తుతం భారత అండర్-19, ఏ టీమ్ కోచ్ గా ఉన్న ద్రవిడ్, 'ఒక విధంగా జట్టును మంచి సమతౌల్యం చేసేందుకు కారణమైంది. భారత్ రెండేళ్లుగా బాగా ఆడుతోంది. మనం అక్కడికి వెళ్తాం, సులువుగా ప్రపంచ కప్ గెలుచుకొస్తామనే మాటలు వినిపించాయి. ఎందుకంటే గత రెండేళ్లుగా మనం నెంబర్ వన్ గా నిలిచాం' అని రాహుల్ చెప్పాడు.

'సిరీస్ ఫలితం తర్వాత కూడా నా అభిప్రాయంలో కొద్దిగా కూడా మార్పు లేదు. నాకు ఇప్పటికి కూడా మనం టైటిల్ ఫేవరెట్లలో ఒకరమని అనిపిస్తోంది. కానీ ఇది చాలా కఠినంగా ఉండబోతోంది. మనకు గట్టి పోటీ ఎదురవబోతోంది' అని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.