ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ  

ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ   

ఐపీఎల్ -12 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు తరుపున ఆడుతున్న సౌత్ ఆఫ్రికా బౌలర్ కాగిసో రబడ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకునేందుకు ఐపీఎల్ నుంచి వెంటనే వచ్చేయాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కబురు పంపింది. దీంతో అతడు స్వదేశానికి బయలుదేరాడు.

ప్రస్తుత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబడ టాప్‌లో కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు దక్కించుకున్నాడు. కీలక దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదని రబడ వ్యాఖ్యానించాడు. వన్డే ప్రపంచకప్‌ ఎంతో దూరంలో లేనందున స్వదేశానికి వెళ్లాల్సివస్తోందన్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున ఆడటం​ మర్చిపోలేని అనుభూతిని కలిగించిందన్నాడు. తమ టీమ్‌ ఐపీఎల్‌ విజేతగా నిలవాలని ఆకాంక్షించాడు. రబడ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడాన్ని డీసీ హెచ్‌ కోచ్ రికీ పాంటింగ్‌ దురదృష్టకర పరిణామంగా వర్ణించాడు.