16 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపు

16 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపు

ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టుగా బెంగళూరు జట్టు నిలిచింది. ఢిల్లీతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు పోరాడి ఓడింది. ఆ జట్టుకు ఇది ఎనిమిదో ఓటమి. కేవలం ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించిన బెంగళూరు ఇంకా రెండు మ్యాచ్‌ల్లో ఆడాల్సి ఉంది. 188 టార్గెట్ ను చేధించడంలో బెంగళూరు పోరాడింది. పార్దీవ్ పటేల్(39, 20 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్స్) తప్ప మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. విరాట్ కోహ్లీ(23, 17 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్), ఏబీ డీవిలియర్స్(17), శివమ్ దూబే(24), క్లాసీన్(3), గుర్కీరత్ (27), వాషింగ్ టన్ సుందర్(1) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. స్టోనిస్ చివర్లో మెరుపులు మెరిపించినా.. జట్టును గెలిపించలేకపోయాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పృథ్వీషా (18) ఉమేష్ బౌలింగ్ లో పార్దీవ్ పటేల్ కు దొరికిపోయాడు. అయితే శిఖర్‌ధావన్‌(50; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్ లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(52; 37 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స్ లు) బాధ్యతాయుతంగా ఆడి రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధావన్‌ ఔటయ్యాక పంత్‌(7), శ్రేయస్‌అయ్యర్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌(11) వరుసగా పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌(28; 13 బంతుల్లో 1ఫోరు, 3సిక్స్ లు), అక్షర్‌పటేల్‌(16; 9 బంతుల్లో 3ఫోర్లు) దూకుడుగా ఆడారు.