రేపు ఈడీ దర్యాప్తుకి హాజరు కావాల్సిందే

రేపు ఈడీ దర్యాప్తుకి హాజరు కావాల్సిందే

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో రాబర్ట్ వాద్రాను ప్రశ్నించడంపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. రేపు (మంగళవారం) వాద్రా ఈడీ ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈడీ ఇంటరాగేషన్ పై స్టే ఇవ్వాలని కోరుతూ వాద్రా వేసిన పిటిషన్ విచారణను కోర్టు మార్చి 2కి వాయిదా వేసింది.

అయితే గత ఏడాది వాద్రా కార్యాలయాలపై చేసిన దాడుల్లో స్వాధీనం చేసుకొన్న పత్రాల సాఫ్ట్, హార్డ్ కాపీలను ఐదు రోజుల్లోగా వాద్రాకు అప్పగించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి అరవింద్ కుమార్ ఈడీని ఆదేశించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈడీ దర్యాప్తును వేగవంతం చేయాలనుకొంటోందని, దీంతో తాము సహనాన్ని కోల్పోతున్నామని వాద్రా తరఫు సీనియర్ న్యాయవాది కెటిఎస్ తులసి ఆరోపించారు.

ఏ పత్రాల ఆధారంగా ఈడీ తనను ప్రశ్నిస్తోందో వాటి కాపీలను తనకు అందజేయాలని కోరుతూ రాబర్ట్ వాద్రా శనివారం కోర్టులో దరఖాస్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ అయిన రాబర్ట్ వాద్రా ఓ మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్నారు. విదేశాలలో అక్రమాస్తుల కొనుగోలు, రాజస్థాన్ బికనేర్ లో భూకుంభకోణం కేసుల్లో వాద్రా పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ 7న ఈడీ ఢిల్లీలోని వాద్రా కార్యాలయాలపై దాడులు చేసింది. ఢిల్లీ, జైపూర్ లలో ఈడీ ఎదుట వాద్రా పలుమార్లు హాజరయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఇదంతా రాజకీయ ప్రతీకారంతో జరుగుతున్న తంతు అని వాద్రా ఆరోపించారు.

లండన్ లోని 12, బ్రయాన్ స్టన్ స్క్వేర్ లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తిని మనీ లాండరింగ్ ద్వారా కొనుగోలు చేశారనే కేసులో వాద్రా ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశారు. ఈ ఆస్తి వాద్రాదేనని ఈడీ ఆరోపిస్తోంది.