దీపక్ తల్వార్ రూ.120 కోట్ల ఆస్తులు అటాచ్

దీపక్ తల్వార్ రూ.120 కోట్ల ఆస్తులు అటాచ్

మనీ లాండరింగ్ కేసులో విమానయాన లాబీయిస్ట్ దీపక్ తల్వార్ కి చెందిన దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిరోసిటీ ప్రాంతంలో ఉన్న రూ.120 కోట్ల విలువైన హోటల్ హాలిడే ఇన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసింది. దీపక్ తల్వార్, ఆయన కుమారుడు ఆదిత్య తల్వార్ పై ఈడీ శనివారం ఢిల్లీలోని ఒక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. తల్వార్ కు వేవ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా తల్వార్ యజమాని అని ఈడీ ఆరోపించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హోటల్ నిర్మాణానికి అక్రమ డబ్బుని ఉపయోగించాడని తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆ సంపదను అటాచ్ చేయాల్సిందిగా ఆదేశించినట్టు ఏజెన్సీ తెలిపింది. 

యుపిఏ హయాంలో తల్వార్ దళారిగా వ్యవహరిస్తూ విదేశీ ప్రైవేట్ విమానయాన కంపెనీలకు అనుకూల వాతావరణం ఏర్పరిచారని దీంతో జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ ప్రత్యేక జడ్జి సంతోష్ స్నేహీ మాన్ కి సమర్పించిన ఛార్జిషీట్ లో పేర్కొంది. విదేశీ విమానయాన సంస్థలు తమకు అనుకూల వాతావరణం ఏర్పరచినందుకు 2008-09లో తల్వార్ కు రూ.272 కోట్లు ముట్టజెప్పాయని, ఈ అక్రమ ధనాన్ని తెలుపు చేసుకొనేందుకు తల్వార్ భారత్ లో, విదేశాలలో తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట అనేక కంపెనీలు తెరిచాడని తెలిపింది. తల్వార్ ని జనవరి 30న అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 

ఈ చార్జిషీట్ పై కోర్టు ఏప్రిల్ 15న విచారణ జరుపుతుంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, త్వరలో ఒక అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు ఈడీ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది డీపీ సింగ్, నితేష్ రాణాలు కోర్టుకు తెలిపారు. ఖతర్ ఎయిర్వేస్, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా సహా పలు విదేశీ విమానయాన సంస్థల తరఫున లాబీ చేయడంలో సహకరించిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ, నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎయిరిండియాల అధికారుల పేర్లను తెలుసుకొనేందుకు తల్వార్ ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కింది కోర్టుకు తెలిపింది.