అది మేం ఆపలేం

అది మేం ఆపలేం

సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారని ఓ ఉద్యోగిని చేసిన ఆరోపణలను మీడియా ప్రచురించకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్ట్ సోమవారం కొట్టేసింది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం తన పరిధిలోకి తీసుకున్నందువల్ల తమ జోక్యం అవసరం లేదని చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని బెంచ్ చెప్పింది. 

సీజేఐకి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలను ప్రచురిస్తే భారత న్యాయవ్యవస్థపై దాడి చేసినట్లేనని యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. అందువల్ల ఈ వ్యవహారంపై ముగ్గురు జడ్జిల ప్యానెల్ దర్యాప్తు ముగిసేవరకు ఏ విషయాన్ని ప్రసారం చేయకుండా, ప్రచురించకుండా తక్షణమే నిషేధం విధించాలని కోరింది. 

సుప్రీంకోర్ట్ మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానానికి ముగ్గురు జడ్జిల ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. గత శుక్రవారం ఈ సంఘం మొదటిసారి సమావేశమైంది.