చిదంబరానికి బెయిల్ వచ్చేనా ?

చిదంబరానికి బెయిల్ వచ్చేనా ?


INX మీడియా కేసులో చిదంబరం బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తేల్చనుంది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో  మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. స్పెషల్ కోర్టు చిదంబరం కస్టడీని 27 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. చిదంబరానికి బెయిల్ ఇవ్వాలా లేదా అనే దానిపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. చిదంబరం ఉన్నత స్థాయి వ్యక్తి అని ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందని ఈడీ వాదిస్తోంది.

చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ తెచ్చేందుకు జరిగిన అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు 305 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వీటికి నిబంధనలు అతిక్రమించి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ అనుమతి ఇచ్చిందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చిదంబరం పాత్ర ఉందని తేలడంతో ఈడీ ఆయనను ఆరెస్ట్ చేసింది. సీబీఐ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ  కస్టడీలోకి తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే ఈ నెల 27వరకూ ఆయన తీహార్‌ జైల్లోనే గడపాల్సి ఉంటుంది.