ఆప్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు

ఆప్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ గద్దెపై కూర్చున్న ఆప్ ప్రభుత్వానికి, కేంద్రంలోని అధికార బీజేపీ సర్కారుకి మధ్య కీలక అంశాలపై ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఇవి మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జనసభ పేరుతో ఢిల్లీలోని షకూర్ బస్తీలో ర్యాలీ నిర్వహించబోయారు. దీనికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీపై విమర్శల దాడి చేశారు.

భద్రతా కారణాలరీత్యా ఢిల్లీ పోలీసులు ఈ ర్యాలీకి అనుమతించలేదని తెలిసింది. జనసభ నిర్వహించే స్థలం, ప్రదేశం అత్యంత సున్నితమైనవిగా చెబుతున్నారు. దీంతో భద్రతకు పెను సమస్య ఏర్పడుతుందని వివరిస్తూ ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఏసీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీనికి బీజేపీయే కారణమని ఆప్ ఆరోపించింది. ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన ఏ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అడ్డు చెప్పలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలోని ఏడు సీట్లు ఓడిపోతున్నామని బీజేపీవాళ్లూ ఒప్పుకోండని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


శనివారం ఢిల్లీలోని షకూర్ బస్తీ ప్రాంతంలో అరవింద్ కేజ్రీవాల్ ఒక ర్యాలీ నిర్వహించాలని అనున్నట్టు పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. ముందస్తుగానే అన్ని అనుమతుల కోసం ఢిల్లీ పోలీసులను సంప్రదించామని కానీ శనివారం చివరి నిమిషంలో అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారని ఆయన చెప్పారు. బీజేపీ సూచనల మేరకే ఢిల్లీ పోలీసులు తమ ర్యాలీకి అనుమతి నిరాకరించారని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో అదే ప్రాంతంలో బీజేపీ నేత హర్షవర్థన్ సింగ్ ర్యాలీ ఎలా జరగనుందని ప్రశ్నించారు.