నోట్ల రద్దు వద్దని అప్పుడే చెప్పా...

నోట్ల రద్దు వద్దని అప్పుడే చెప్పా...
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనమైంది... సామాన్యుడు పనులన్నీ మానుకుని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చింది. అయితే ఓ అనాలోచిత నిర్ణయమని ఆర్థికవేత్తలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. అసలు రిజర్వ్ బ్యాంక్‌ను సంప్రదించకుండానే ప్రధాని నిర్ణయం తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. మరి నోట్ల రద్దు కథ వెనుక ఏం జరిగిందనేదానిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తన ప్రసంగంలో వెల్లడించారు. కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌లో రఘురాం రాజన్ మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దు చర్య మంచి నిర్ణయం కాదనే విషయాన్ని ముందుగానే తాను ప్రభుత్వానికి సూచించానని వెల్లడించారు. అయితే నోట్ల రద్దు చర్యకు ముందు ప్రభుత్వంతో ఆర్‌బీఐ సంప్రదింపులు చేయలేదంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు రఘురాం రాజన్... నోట్ల రద్దుపై నేను ప్రభుత్వంతో సంప్రదించలేదనే విషయాన్ని ఎన్నడూ చెప్పలేదని గుర్తు చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్... ఆ నిర్ణయం మంచిది కాదని భావిస్తున్నామని అప్పట్లోనే ప్రభుత్వానికి తెలిపామన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అయినా సరైన ప్లాన్‌తో చేశారా అంటే అది కూడా జరగలేదన్నారు రాజన్... దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో 87.5 శాతం వినియోగంలో ఉన్న నోట్లను రద్దు చేసేముందు ఎంతో ప్లాన్ అవసరమన్నారు. రద్దు చేస్తున్న మొత్తం నోట్ల విలువకు సమానమైన నోట్లను ముందుగానే ముద్రించి ఆ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తే బాగుండేదన్నారాయన. ఇవేవీ చేయకుండానే భారత్‌ పెద్ద నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకుందన్న రఘురాం రాజన్... దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. నోట్ల రద్దు ప్రభావం భవిష్యత్‌లో ఎలా ఉంటుందో వేచిచూడాల్సి ఉన్నప్పటికీ... ఇప్పుడైతే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమే చూపిందన్నారు రాజన్... నోట్లు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని... చెల్లింపులు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మరీ ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఆర్థిక ప్రగతి కుంటుపడిందన్న ఆర్బీఐ మాజీ గవర్నర్... ఇది చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి తెచ్చిందన్నారు. నోట్ల రద్దుతో భవిష్యత్‌లో సానుకూల ప్రభావాలు కనిపించినా అవి ఎంత మేరకు ఉపయోగకరమో ఇప్పుడు చెప్పలేమన్నారు. అయితే నోట్ల రద్దయినా... జీఎస్టీ అయినా సమర్థవంతంగా అమలు చేస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ విధానాన్ని మరింత సమర్థంగా అమలు చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్న రాజన్... ఇదేమీ పెద్ద కష్టమైన పని కాదన్నారు. దీనిపై కూడా కొంత కసర్తు అవసరం అన్నారాయన. అయితే నోట్ల రద్దును వ్యతిరేకించినందుకే రఘురాం రాజన్‌ను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.