మాజీ ఎంపీపై కేసు విచారణకు జైలుకెళ్లిన సీబీఐ!!

మాజీ ఎంపీపై కేసు విచారణకు జైలుకెళ్లిన సీబీఐ!!

దేవరియా జైలులో రియల్ ఎస్టేట్ వ్యవహారంలో దాడి చేసిన కేసు దర్యాప్తు చేసేందుకు మాజీ ఎంపీ, నేరచరితుడైన నేత అతీక్ అహ్మద్ కోసం సీబీఐ బృందం గురువారం రాత్రి దేవరియా చేరుకుంది. జైలు గదుల్లోనే ఆయనని విచారించింది. గురువారం అర్థరాత్రి ఎనిమిది మంది సభ్యుల సీబీఐ బృందం దేవరియా వచ్చింది. శుక్రవారం ఉదయం సీబీఐ టీమ్ సంబంధిత జైలు సిబ్బందిని ప్రశ్నించి కావాల్సిన సమాచారం రాబట్టింది. అతీక్ అహ్మద్ పై ఉన్న ఆరోపణల గురించి అన్ని వివరాలు తెలిసిన ఒక సందేహాస్పదుడైన వ్యక్తిని ప్రశ్నిస్తోంది. పరిపాలనా యంత్రాంగం సూచనల మేరకు అతీక్ వ్యవహారంలో దేవరియా జిల్లా జైలు సూపరింటెండెంట్ సహా ఐదుగురు జైలు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించగానే జైలులోని చాలా మంది సిబ్బంది, అధికారులు ఆందోళన చెందుతున్నారు.

లక్నోలోని ఆలంబాగ్ ప్రాంతంలో విశ్వేశ్వర్ నగర్ నివాసి మోహిత్ జైస్వాల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. డిసెంబర్ 26న లక్నో నుంచి ఆయనను కిడ్నాప్ చేసి దేవరియా తీసుకొచ్చారు. జైలులో ఉన్న అతీక్ అహ్మద్, ఆయన అనుచరులు తనని దారుణంగా కొట్టారని మోహిత్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో లక్నో ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ లో అతీక్, ఫారుఖ్, జకీ అహ్మద్, ఉమర్, జఫరుల్లా, గులాబ్ సర్వర్, మరో పన్నెండు మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. తర్వాత అతీక్ ని దేవరియా జైలు నుంచి మరో జైలుకి మార్చడం జరిగింది. జైలు అధికార యంత్రాంగం ఈ వ్యవహారం తీవ్రంగా పరిగణించలేదు. ఏప్రిల్ 23న సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు తీవ్రతను గుర్తించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.