ఆర్బీఐ ఆంక్షలు..! ఆ బ్యాంకు నుంచి విత్‌ డ్రా పరిమితి రూ.వెయ్యే..!

ఆర్బీఐ ఆంక్షలు..! ఆ బ్యాంకు నుంచి విత్‌ డ్రా పరిమితి రూ.వెయ్యే..!

పెద్ద సంఖ్యలో బ్యాంకు లావాదేవీలు చేసేవారికి షాకింగ్ న్యూస్... ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించడంతో పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ)బ్యాంక్ నుంచి రోజుకు కేవలం రూ.1000 మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుంది. అంతేకాదు.. వచ్చే 6 నెలల వరకు రుణాలు ఇవ్వడంకానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆర్బీఐ ఆంక్షలు, సూచనలతో సేవింగ్స్, కరెంట్, ఇతర ఖాతాదారులు రోజుకు రూ. వెయ్యి మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాల్ వెల్లడించారు. 

అయితే, పీఎంసీ లావాదేవీలపై ఆంక్షలు విధించడం అంటే.. బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడం కోసం మాత్రం కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్‌బీఐ తదుపరి నోటీసులు, సూచనలు జారీ చేసే వరకు వచ్చే 6 నెలల్లో పరిమితులతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకోవాలని సూచించింది ఆర్బీఐ. కాగా, ఈ ఆంక్షలపై ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది... బ్యాంకు బ్రాంచీల దగ్గరకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఎంసీ బ్యాంకుకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది.. 35 ఏళ్ల క్రితం ఈ బ్యాంకు ప్రారంభమైంది.. 1984లో ముంబైలోని ఓ చిన్నగదిలో ప్రారంభమై.. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా 137 శాఖలకు విస్తరించింది. ఆర్బీఐ ఆంక్షలతో ఇప్పుడు ఖాతాదారులు 6 నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కోకతప్పని పరిస్థితి ఏర్పడింది.