'బ్లైండ్ లెస్ ఫ్రీ' స్టేట్‌గా మార్చాలన్నదే ఆకాంక్ష

'బ్లైండ్ లెస్ ఫ్రీ' స్టేట్‌గా మార్చాలన్నదే ఆకాంక్ష

తెలంగాణను 'బ్లైండ్ లెస్ ఫ్రీ' రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్ష అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... జిల్లాలో ఈ నెల 15 నుండి కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని... ప్రతీరోజు గ్రామీణప్రాంతాలలోని ప్రజలకు 250 నుంచి 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ప్రజలకు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా, కంటి ఆపరేషన్లు, కళ్లజోళ్లు, మందులు ఉచితంగా ఇవ్వనున్నామని వెల్లడించిన కడియం... డీఎంహెచ్‌వో, అధికారులు, సిబ్బంది ప్రభుత్వంతో పాటు పనిచేయాలని, రూ. 55 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 

ఇక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అధికారులు ఉత్సహంగా పనిచేయడం లేదన్న కడియం శ్రీహరి... ఇతర జిల్లాలతో పోటీపడి ఈ విడత హరితహారంలో రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని... ఇప్పటికైనా సీరియస్‌గా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న రైతులకు రైతు భీమా పథకం వర్తించే విధంగా వ్యవసాయశాఖ అధికారులు పనిచేయాలని... ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలు తెలంగాణలో మొదటిస్థానంలో ఉండేవిదంగా కలెక్టర్లు చొరవచూపాలన్నారు కడియం.