దోపిడీ దొంగల్లా తయారయ్యారు... ఏసీబీ అధికారులపై మంత్రి ఫైర్

దోపిడీ దొంగల్లా తయారయ్యారు... ఏసీబీ అధికారులపై మంత్రి ఫైర్

ఏసీబీ అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏసీబీ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఏసీబీ అధికారులు దోపిడీ దొంగల్లా తయారయ్యారన్నారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని.. అలాంటి అధికారులను చూస్తుంటే అసహ్యం వేస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై హోంమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. సీఎం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లలేదని ఆయనకు కచ్చితంగా తెలుస్తుందని అన్నారు. ఆ అధికారులపై విచారణ కూడా అవసరం లేదు క్లియర్‌గా ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.

తప్పు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలన్న ఆయన.. విశాఖ రేంజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పారు. కంచె చేను మేసినట్లు ఏసీబీ అధికారుల పనితీరు ఉందన్నారు డిప్యూటీ సీఎం. ‘విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు దారి దోపిడీ దొంగలకంటే దారుణంగా ఉన్నారు. అవినీతిని అరికట్టవలిసిన వాళ్లు దారుణాలు చేస్తుంటే మరి న్యాయం ఎవరు చేయగలరు ? వెంటనే వాళ్లను సస్పెండ్ చేయడమే కాకుండా.. సామాన్యులు తప్పుచేస్తే క్రిమినల్ కేసులు ఎలా ఫైల్ చేస్తున్నారో.. వీళ్లపై కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేసి చర్యలు తీసుకోవాలని ఏసీబీ డీజీతో మాట్లాడానని ఏం చర్యలు తీసుకుంటారో చూద్దామని సుభాష్ చంద్రబోస్ అన్నారు.