వరల్డ్ కప్ కి సర్ఫరాజ్ అహ్మదే కెప్టెన్

వరల్డ్ కప్ కి సర్ఫరాజ్ అహ్మదే కెప్టెన్

మే 30 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ లో పాకిస్థాన్ జట్టుకు వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్ గా ఉంటాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ఎహ్సాన్ మణి మంగళవారం ప్రకటించారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ఆండిలె ఫెలుక్వాయోపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు సర్ఫరాజ్ పై ఐసీసీ నాలుగు వన్డేల నిషేధం వేటేసింది. దీంతో అహ్మద్ కు కెప్టెన్సీ దక్కడం అనుమానమేననే వ్యాఖ్యలు వినిపించాయి. 

సర్ఫరాజ్ అహ్మద్ తో సమావేశం తర్వాత పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి, మేజర్ టోర్నమెంట్ లో సర్ఫరాజ్ జట్టుకి సమర్థవంతమైన నాయకత్వం వహించగలడనే విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఎలాంటి అనుమానాలు లేవు. ఏదైనా ఇతర నిర్ణయం తీసుకుంటే తప్ప అతనే కెప్టెన్ గా ఉంటాడని’ మణి చెప్పారు. ‘ప్రతి సిరీస్ తర్వాత మీడియా నిరాధారమైన ఊహాగానాలు చేస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ (వరల్డ్ కప్ కి ముందు ఐదు వన్డేలు)కి, వరల్డ్ కప్ కి అతనే కెప్టెన్ గా ఉంటాడు. ఆ తర్వాత మేం జట్టు ప్రదర్శనపై సమీక్ష జరుపుతామని’ తెలిపారు.

కెప్టెన్ గా సర్ఫరాజ్ చేసిన సేవలను పీసీబీ విస్మరించజాలదని మణి అన్నారు. ‘పాకిస్థాన్ కోసం సర్ఫరాజ్ చేసిన విలువైన సేవలను మనం పరిగణనలోకి తీసుకోవాలని’ చెప్పారు. ‘వరల్డ్ కప్ సన్నాహాల్లో సర్ఫరాజ్ కూడా ఒక అవిభాజ్య భాగం. అతను ఒక మంచి వ్యూహకర్త, నాయకుడు, ఆటగాడిగా నిరూపించుకున్నాడని’ మణి తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2017 టైటిల్ గెలుచుకున్న పాకిస్థాన్ జట్టుకి నాయకత్వం వహించి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో జట్టుని మొదటి స్థానంలో నిలిపాడని ప్రశంసించారు.

వరల్డ్ కప్ జట్టుకి తనను కెప్టెన్ ని చేశారన్న ప్రకటనపై సర్ఫరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘గత వరల్డ్ కప్ లలో పాకిస్థాన్ జట్టుకి నాయకత్వం వహించిన అతికొద్ది మంది దిగ్గజ క్రికెటర్ల సరసన నన్ను నిలపడం ఒక గౌరవంగా భావిస్తున్నానని’ చెప్పాడు. ‘వరల్డ్ కప్ కి మేం బాగా సన్నద్ధమవుతున్నామనే నమ్మకం కలుగుతోంది. అత్యుత్తమ ప్రతిభావంతులు, మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో అంకితభావం గల సపోర్ట్ స్టాఫ్ సహకారం ఉందని’ తెలిపాడు.