ఆ కమిషన్ కోసమే ఇసుక కొరత...!

ఆ కమిషన్ కోసమే ఇసుక కొరత...!

ఏపీ ప్రభుత్వం మీద టీడీపీ నేత, మాజీ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖలు చేశారు. తాము అడిగిన మొత్తాన్ని కమిషన్ రూపంలో ఇవ్వడం లేదనే ఏపీ ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించినట్టు ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీపై అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర విమర్శలు చేశారని, కానీ ఆయన అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటుతున్నా ప్రజలకు ఇసుక అందించ లేపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇసుక కొరత వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు.

సిమెట్ బస్తాకు ఐదు రూపాయల కమిషన్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు సిమెంట్ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చారని, ఆ కంపెనీలు ఒప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఇసుక మార్కెట్ బ్లాక్ చేసారని అన్నారు. సజ్జల, గంగిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు సిమెంట్ కంపెనీలతో ఏం మాట్లాడారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పారదర్శక పాలన అని చెబుతున్న జగన్ కి ఇసుక క్వారీల నుంచి తన ఎమ్మెల్యేలు, మంత్రులకు లక్షలాది రూపాయలు వెళుతున్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. ఇసుక పేరు చెప్పి పంది కొక్కుల్లా దోచుకుంటున్నారని దేవినేని ఉమా ఘాటైన విమర్శలు చేశారు. పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసి వేశారని, అమరావతి రాజధానిలో పనులు నిలిపివేయడం వల్ల దాదాపు 50 వేల మంది ఇంజనీర్లు వెనక్కి వెళ్లిపోతున్నారని విమర్శించారు.