భద్రాద్రికి పోటెత్తిన భక్తులు..

భద్రాద్రికి పోటెత్తిన భక్తులు..

రాములోరి కల్యాణానికి భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఎక్కడ చూసినా సీతారామ కల్యాణ శోభ కనిపిస్తోంది. చలువ పందిళ్లు, పూల తోరణాల మధ్య కల్యాణానికి రాముడు సిద్ధమవుతున్నాడు. రాములోరి పెళ్లి చూసేందుకు పదండంటూ... జనం భద్రాద్రికి క్యూ కడుతున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి కొత్త శోభ సంతరించుకుంది. ముత్యాల పందిరి భద్రాద్రి రాముని పెళ్లికి ముస్తాబైంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నుంచి నవాహ్నిక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.. తొలి రోజున ప్రత్యేక తీర్థ బిందెను గోదావరి నుంచి తీసుకొచ్చి అంకురారోపణం చేశారు. 11న ధ్వజపట మండల లేఖనం, 12న ధ్వజారోహణం, 13న ఎదుర్కోలు ఉత్సవాలు నిర్వహించారు. ఇక ఏప్రిల్ 14న అంటే ఈ రోజున సీతారామచంద్రస్వామి వారి కల్యాణం మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 10.30 గంటలకు సీతరాములకు ఘనంగా కల్యాణం జరపనున్నారు. 15న శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.