ఎన్నికల తర్వాత గ్రామాలలో గొడవలు జరగడం సహజమే !

ఎన్నికల తర్వాత గ్రామాలలో గొడవలు జరగడం సహజమే !

ఆత్మకూరులో జరిగింది రెండు వర్గాల మధ్య గొడవ మాత్రమేనని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. బాధితులమని చెప్పుకునే వాళ్లలో సగం మంది ఇతర ఇబ్బందులతో వచ్చిన వాళ్లేనని సవాంగ్ తెలిపారు. త్వరలోనే పల్నాడులో పరిస్థితులు కొలిక్కి వస్తాయని చెప్పారు. పోలీసులపై కొందరు నేతలు అసభ్యకరంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందాయన్న డీజీపీ వివాదం పెద్దది కాకూడదనే సంయమనం పాటించామని అన్నారు.

అలాగే గణేష్ ఉత్సవాలు ముగిసే వరుకు పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో ప్రజలకి ఏ ఇబ్బందులు ఉన్నా స్పందన ద్వారా స్వేచ్చగా చెప్పుకొనే వీలుంటుందని అన్నారు. ఛలో ఆత్మకూరు సందర్భంగా పోలీసులు స్పందించిన తీరు అభినందనీయం అని ప్రశంసించారు. కొందరు నేతలు తిడుతున్నా పోలీసులు ఎంతో ఓర్పుగా వ్యవహరించారని పేర్కొన్నారు. వైన్ వెల్ఫేర్ బిల్డింగ్ లో ఉన్నవారందరని పోలిసులే స్వయంగా తమ గ్రామాలకు తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు.

అంతేకాక ఎన్నికలు ముగిసిన తరువాత గ్రామాలలో గొడవలు జరగడం సహజమని దాడులు జరుగుతాయనే ఆలోచన గొడవలకు దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరులో జరిగింది రెండు వర్గాల మద్య గొడవ తప్ప పార్టీలకు సంబంధంలేదని అన్నారు. పోలీసులు ఏకపక్షం అని ఆరోపించడం సరికాదని, పోలీసులు ప్రజల పక్షంగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. దాడి బాదితులని చెబుతున్నవారిలో సగంమందికి పైగా ఇతర ఇబ్బందులతో వచ్చినవాళ్ళేనన్న ఆయన ప్రతి ఒక్కరి గురించి రెవిన్యూ అధికారులు క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుంటున్నారని అన్నారు.