ధోనీ టీ20 కెరీర్‌ ముగిసినట్టే..

ధోనీ టీ20 కెరీర్‌ ముగిసినట్టే..

టీ20ల్లో ధనాధన్‌ ధోనీ మెరుపులు ఇక కనిపించవా? ధోనీ మార్క్‌ షాట్లను ఇక పొట్టి ఫార్మేట్‌లో చూడలేమా? రిషబ్‌ పంత్‌ రాక.. ధోనీ టీ20 కెరీర్‌కు ముగింపు పలికిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్, ఆ తర్వాత సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. టీ20 జట్టులో ధోనీపై వేటు వేశారు. ధోనీ టీ20 కెరీర్‌ ముగిసిపోలేదని.. సెకెండ్‌ వికెట్‌ కీపర్‌ను గుర్తించే క్రమంలో పంత్‌, కార్తీక్‌లకు అవకాశాలిచ్చమని బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చెబుతున్నా.. అసలు నిజం వేరే ఉందని తెలుస్తోంది. 

2020లో టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. అప్పటికి ధోనీ వయసు 39. ధోనీ ప్రస్తుత ఫామ్‌ కూడా చెప్పుకోదగ్గట్టు లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న సెలెక్టర్లు.. ధోనీని తప్పించారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేసే ఉద్దేశం లేనప్పుడు.. ఇప్పుడే అతణ్ని తప్పించడం ఉత్తమమని.. యువ కీపర్లకు ఇప్పటి నుంచే అవకాశాలివ్వడం మేలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా ధోనీకి కూడా సెలెక్టర్లు చేరవేశారని సమాచారం. ఇక.. వన్డేల విషయంలో మాత్రం ధోనీ ఆడినంత కాలం అవకాశాలివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారని తెలుస్తోంది.