వరల్డ్ కప్ జట్టులో ధోనీది కీలక పాత్ర

వరల్డ్ కప్ జట్టులో ధోనీది కీలక పాత్ర

వరల్డ్ కప్ కి టీమిండియా ఇంగ్లాండ్ బయల్దేరడానికి ముందు మంగళవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కోచ్ రవిశాస్త్రి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఆకాశానికి ఎత్తేశాడు. వరల్డ్ కప్ ఆడబోతున్న భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర ఎంతో కీలకమని, చాలా చిన్న అవకాశాలను అనుకూలంగా మార్చుకొనే అతని సామర్థ్యం ఎంతో ముఖ్యపాత్ర పోషించనుందని శాస్త్రి అన్నాడు.

జరగబోయే ఐసీసీ టోర్నమెంట్ లో ధోనీ పాత్ర గురించి ఏం నిర్ణయించారన్న ప్రశ్నకు శాస్త్రి 'ఎప్పటిలాగే ఎంతో కీలకం కానుంది. అతను అతనే. మ్యాచ్ పరిస్థితులను వివరించడంతో అతని సామర్థ్యం అమోఘం. ఒక వికెట్ కీపర్ గా తనేంటో కొన్నేళ్లుగా నిరూపించుకున్నాడు. అందువల్ల ఆ స్థానాన్ని పూరించగల మెరుగైన కీపర్ వేరెవరూ లేరు. క్యాచ్‌ లు పట్టడం మాత్రమే కాకుండా రనౌట్, స్టంపింగ్ చేయడంలో అతను అద్భుతంగా స్పందిస్తాడు. మ్యాచ్ లో ఇలాంటి చిన్న చిన్న అవకాశాలే ఆట స్వరూపాన్ని మార్చేస్తాయి. అతని కంటే మంచి కీపర్ మరొకరు లేరు' అని చెప్పాడు.
 

ధోనీ నాలుగో వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జరిగిన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతూ అద్భుతమైన ఫామ్ లోకి తిరిగొచ్చాడు. గత ఐపీఎల్ లో 83.20 సగటుతో 416 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ధోనీ ఫుట్ వర్క్ తనను ఆకట్టుకుందని శాస్త్రి తెలిపాడు. ముఖ్యంగా పూర్తి శక్తి ఉపయోగించి బంతిని బాదిన బ్యాటింగ్ తో ఎంఎస్ అదరగొట్టేశాడని అన్నాడు.