రాముడి పేరుతో టీఆర్ఎస్ ని టార్గెట్ చేయాలనుకున్న బీజేపీ ప్లాన్ పనిచేసిందా?

రాముడి పేరుతో టీఆర్ఎస్ ని టార్గెట్ చేయాలనుకున్న బీజేపీ ప్లాన్ పనిచేసిందా?

రాముడి పేరుతో టీఆర్‌ఎస్‌ని టార్గెట్‌ చేయాలనుకున్న కమలం పార్టీ వ్యూహం ఏమైంది ? గ్రేటర్‌ వరంగల్‌లో వరుస కార్యక్రమాలు చేయాలనుకున్న బీజేపీ స్కెచ్‌ బెడిసి కొట్టిందా ? ఎమ్మెల్యే ఇంటిపై దాడితో.. ఆ ఇష్యూ.. అక్కడికే పరిమితమైందా ? ధర్మారెడ్డి విషయంలో బీజేపీ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి ?

గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. వరంగల్ జిల్లాలో ఏ సంఘటన జరిగినా.. దాన్ని అవకాశంగా మలుచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.  ఎంపీ అరవింద్‌ కారును అడ్డుకున్నందుకు.. ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఇంటిని ముట్టడించారు. జనగామ జిల్లాలో యూత్ కార్యకర్తలపై పోలీసులు దాడి చేస్తే.. వరంగల్ అర్బన్ జిల్లా నేతలతోనే నిరసన కార్యక్రమానికి చెపాట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ స్మారక చిహ్నం నిర్మాణం కోసం.. గుడి స్థలం విషయంలోనూ బిజెపి గట్టిగానే నిరసనలు చేసింది. కానీ, రాముడిని కించపరిచారంటూ ధర్మారెడ్డికి వ్యతిరేకంగా చెపట్టిన నిరసనలను..వ్యూహాత్మకంగా మలచుకోవడంలో బీజేపీ విఫలమైందా ? కమలం కార్యకర్తల తొందరపాటు చర్య.. ఈ ఇష్యూను క్యాష్‌ చేసుకునే అవకాశాన్ని చేజార్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయోధ్య రామమందిరం కోసం సేకరిస్తున్న విరాళాలపై ధర్మారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని గుర్తించడంలో స్థానిక బీజేపీ నేతలు విఫలమయ్యారు. రెండు, మూడు రోజుల తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అప్పుడు  రాష్ట్ర నేతలు మందలించాక.. స్థానిక బీజేపీ నిరసనలకు దిగింది. అయితే తాను రాముడిని ఎక్కడా కించపరచలేదని.. బీజేపీ కార్యకర్తలు అడుగుతున్న చందాల లెక్కల గురించి మాత్రమే అడిగానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.  తొలుత ఈ ఇష్యూను క్లెయిమ్‌ చేసుకోవడంలో విఫలమైన స్థానిక బీజేపీ నేతలు.. అధిష్టానం దగ్గర మార్కులు కోట్టేసేందుకు.. అప్పటికప్పుడు  నిరసనకు దిగారు. కానీ, ఆ ప్లానే బెడిసికొట్టింది. యూత్‌ను ముందు పెట్టుకొని చేసిన నిరసన కార్యక్రమం.. అదుపు తప్పి దాడికి దారి తీసింది. దీంతో ధర్మారెడ్డి వ్యాఖ్యల్ని ప్రజల్లో ఎండగట్టాలనుకున్న వారు కాస్తా.. జైలుపాలయ్యారు. 

నిజానికి ఈ అంశంపై రోజుకో దగ్గర నిరసన చేసేందుకు సీనియర్లు కసరత్తు చేశారట. ఆలయాల దగ్గర నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలకు ప్లాన్‌ చేశారు. అయితే దాడితో ఆ ఇష్యూ సైడ్‌ ట్రాక్‌ అయిపోయింది. అంశాలపరంగా రాజకీయ దాడి చేయాలి కానీ.. భౌతిక దాడులకు దిగితే ఇష్యూ డైవర్ట్‌ అవుతుంది. ఇక్కడ స్థానిక బీజేపీ ఇదే పొరపాటు చేసిందనే వాదన వినిపిస్తోంది. అసలు విషయంకన్నా.. దాడి అంశమే హైలైట్‌ అయింది. మరో వైపు ఈ అంశంలో వరంగల్ అర్భన్, రూరల్‌ నేతల మధ్య విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. నిరసన కార్యక్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయలేదు, ఎవరూ కవ్వించలేదు..మరి అలాంటప్పుడు రాళ్ల దాడి ఎందుకు చేశారు అని చర్చించుకుంటున్నారు. మొదట దాడి చేసింది ఎవరు ? అని కనుక్కునే పనిలో పడ్డారట వరంగల్ అర్బన్‌ బీజేపీ నేతలు. మొత్తానికి ఎమ్మెల్యే ధర్మా రెడ్డి విషయంలో బీజేపీ అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి అని స్పష్టమవుతుంది. బీజేపీ చేసిన తప్పుతో.. టీఆర్‌ఎస్‌ ఊపిరి పీల్చుకుంటోంది.