హిమాలయాల్లో మోడీ ధ్యానంపై ట్వింకిల్ ఖన్నా సెటైర్

హిమాలయాల్లో మోడీ ధ్యానంపై ట్వింకిల్ ఖన్నా సెటైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నుంచి విరామం దొరకగానే హిమాలయాల్లోని కేదార్ నాథ్ దర్శనానికి వెళ్లారు. అక్కడ ఆయన గుహలో ధ్యానం చేస్తున్న ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఫోటో సోషల్ మీడియాలో హెడ్ లైన్లలో నిలిచింది. దీనిపై బాలీవుడ్ నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా ఈ సాధనపై తన సోషల్ మీడియా అకౌంట్ లో సెటైర్లు పేల్చింది. మెడిటేషన్ చేస్తున్న తన ఒక ఫోటోని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ట్వింకిల్ ఖన్నా ఏదైనా అవకాశం దొరికిందే తడవుగా జోకులు పేలుస్తూ ఉంటుంది. 

ట్వింకిల్ ఖన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్యానం చేస్తున్న ఫోటోకి పోటీగా తన ఒక ఫోటో పోస్ట్ చేసింది. ట్వింకిల్ ఖన్నా ఈ ఫోటోతో పాటు 'మిత్రులారా దయచేసి సైన్ అప్ చేయండి-గత కొన్నాళ్లుగా ఎన్నో లెక్కలేనన్ని ఆధ్యాత్మిక ఫోటోలు చూసిన తర్వాత నేను ఇప్పుడు 'మెడిటేషన్ ఫోటోగ్రఫీ-పోజెస్ అండ్ యాంగిల్స్' పేరుతో వర్క్ షాప్ ప్రారంభించ బోతున్నాను. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తర్వాత ఇదే మరో పెద్ద విషయం కానుందని నాకు అనిపిస్తోందని' రాసింది.

ట్వింకిల్ ఖన్నా తరచుగా సోషల్ మీడియాలో ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. ట్వింకిల్ ఖన్నా భర్త అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని రాజకీయేతర ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇందులో ప్రధాని మోడీ ట్వింకిల్ ఖన్నా ఇలా తనపై సెటైర్లు వేయడం గురించి ప్రస్తావించారు. ట్వింకిల్ ఖన్నా మరోసారి మోడీపై సరదా సరదా జోక్ వేసింది.