డీజిల్ డబుల్ ధమాకా

డీజిల్ డబుల్ ధమాకా

పెట్రో ధరల పెంపుతో క్రమంగా జనంపై భారం పడుతోంది... ఇక డీజిల్‌ ధరలపై నియంత్రణపై గతంలో ఉన్న నిబంధనలు ఎత్తివేయడంతో పెట్రో ధరలను అందుకోవడానికి డీజిల్ కూడా పోటీపడుతోంది. పెట్రోల్, డీజిల్ మధ్య పూర్వం దాదాపు రూ.23 వ్యత్యాసం ఉంటే... అది పెరుగుతూ వచ్చి దాదాపు రూ.9కి తగ్గింది. దీంతో రవాణా ఛార్జీలు భారం పెరిగి... క్రమంగా నిత్యావసరాలు సహా అన్నింటి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు దేశచరిత్రలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరి జనం నెత్తిలో పిడుగులా మారాయి. ఆదివారం ఢిల్లీలో ఏకంగా పెట్రో ధర లీటర్‌కు రూ. 76.24కు చేరితే... ఇక డీజిల్ రూ.67.57కి చేరింది. 2011లో క్రూడాయిల్‌ ధరతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నా పెట్రో ధరలు మాత్రం సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. 

అయితే ఇండియన్ ఆయిన్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం 2011 నుంచి క్రూడాయిల్ ధరలు, పెట్రో ధరలు పరిశీలించినట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం క్రమంగా పెట్రో భారం ప్రజలపై ఎలా మోపుతుందో అర్థం చేసుకోవచ్చు. 2011లో బ్యారల్ క్రూడాయిల్ ధర రూ.5,191గా ఉంటే లీటర్ పెట్రోల్ రూ.రూ.63.37గా, డీజిల్ రూ.41.12గా ఉంది. 2012కు వచ్చే సరికి క్రూడాయిల్ ధర మరింత పెరిగి రూ.6,036కి చేరితే లీటర్ పెట్రోల్ ధర అప్పట్లో గరిష్టంగా రూ.73.18కి చేరితే డీజిల్ ధర రూ.40.91గా ఉంది. ఇక 2013లో బ్యారల్ క్రూడాయిల్ ధర రూ. 5,440కి పడిపోవడంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 63.09కి తగ్గగా... డీజిల్ ధర రూ.49.35కి చేరింది. 2014లో మళ్లీ క్రూడాయిల్ ధర రూ.6,408కు పెరగడంతో పెట్రోల్ ధర రూ.71.41గా, డీజిల్ ధర రూ. 56.71కు పెరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే పెట్రోల్ ధరలు హెచ్చుతగ్గులున్నా... డీజిల్ మాత్రం క్రమంగా పెరుగుతూనే వచ్చింది. ఇక 2015కు వచ్చేసరికి క్రూడాయిల్ ధర అనూహ్యంగా రూ. 3,952కు పడిపోయింది. దీంతో పెట్రోల్ ధర రూ. 64.73కి, డీజిల్ ధర రూ. 50.93కి తగ్గింది. తర్వాతి ఏడాది 2016లో క్రూడాయిల్ ధర మరింత తగ్గి రూ. 2,798కి చేరుకుంది... ఇక్కడ పెట్రోల్ ధర రూ.62.61, డీజిల్ ధర రూ.51.31గా ఉంది. 2017లో క్రూడాయిల్ ధర కాస్త పెరిగి రూ.3,270కు చేరగా... లీటర్ పెట్రోల్ రూ. 66.71కు, డీజిల్ రూ.56.13కు పెరిగింది. ఇక 2018లో క్రూడాయిల్ రూ.4,516కు పెరిగితే లీటర్ పెట్రోల్ రూ. 74.91కు, డీజిల్ రూ.66.24కు చేరుకుంది. ముఖ్యంగా ఎన్డీఏ హయాంలో పెట్రో ధరలపై రోజువారి సమీక్ష పద్ధతి తీసుకురావడంతో రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పద్ధతి ద్వారా పెట్రోల్, డీజిల్ మధ్య క్రమంగా వ్యత్యాసం కూడా తగ్గుతూ వచ్చింది. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందంటున్నారు విశ్లేషకులు... రవాణా వ్యవస్థలో డీజిల్ వాహనాల వినియోగమే ఎక్కువ... క్రమంగా డీజిల్‌పై వడ్డింపు పెరగడంతో... వస్తుసేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపి... ధరలకు పెరగడానికి కారణమవుతోందంటున్నారు. యూపీఏ హయాంలో క్రూడాయిల్ ధర ఎక్కువన్నా... ధరలు ఈ స్థాయిలో లేవనేది వాస్తవం.

నోట్: పైన పేర్కొన్న ధరలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించినవి... అయితే దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి స్థానిక పన్నులతో కలిపి అవి మరింత ఎక్కువగానే ఉంటాయి.