కుటుంబాల్లో 'డిజిటల్ అసిస్టెంట్ల' చిచ్చు

కుటుంబాల్లో 'డిజిటల్ అసిస్టెంట్ల' చిచ్చు

పనిలో వేగాన్ని పెంచి సులభతరం చేయడంతోపాటు సమయాన్ని కూడా ఆదా చేసేందుకు మార్కెట్లో అనేక డివైస్ లు అందుబాటులోకి వచ్చినట్టే... స్మార్ట్ ఫోన్స్ ఆధారంగా పనిచేసే డిజిటల్ అసిస్టెంట్స్ కూడా ఈ మధ్య మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. అనేక టాస్క్ లను ఏకకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం పెరిగిపోవడంతో డిజిటల్ అసిస్టెంట్స్ ను ఆశ్రయించేవారి సంఖ్య క్రమంగా ఊపందుకుంటోంది. అయితే పెద్దలకు ఇది పాజిటివ్ అంశమైతే.. పిల్లల మీద మాత్రం నెగెటివ్ ప్రభావం చూపుతున్నట్టు ఆలస్యంగా గ్రహించారు. 

డిజిటల్ అసిస్టెంట్స్ ఎలా పని చేస్తాయి?: 
డిజిటల్ అసిస్టెంట్స్ లో గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ వారి అలెక్సా లు ఇప్పుడు పాపులర్ అయ్యాయి. రూ. 3 వేల నుంచి రూ. 6 వేలు ఆ పైన ధర పలుకుతున్న వీటిని చాలా సున్నితంగా, ఎఫెక్టివ్ గా పని చేసే స్మార్ట్ స్పీకర్స్ గా చెప్పుకోవచ్చు. డిజిటల్ అసిస్టెంట్ ని స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేయడం ద్వారా నెట్ లోని సమస్త సమాచారానికి అది లింకవుతుంది. ఆ స్పీకర్స్ ని ఇళ్లలో బిగించుకొని అవసరమైన వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా మనక్కావాల్సిన సమాచారాన్ని స్పీకర్ ద్వారా అందుకోవచ్చు. ఉదాహరణకు ఇంట్లో మనం రెగ్యులర్ వర్క్స్ లో బిజీగా ఉంటూనే... ఫలానా రోజు, ఫలానా సమయానికి ఢిల్లీ వెళ్లడానికి ఎన్ని ఫ్లయిట్లు ఉన్నాయి? అని అడిగామనుకోండి. డిజిటల్ అసిస్టెంట్ వెంటనే ఆ ఫ్లయిట్ల నెంబర్ చెబుతుంది. ఫలానా రోజు సాయంత్రం ఫలానా ఆడిటోరియంలో ఏ కార్యక్రమం ఉందీ.. అని అడిగామనుకోండి. దాని పేరు చెబుతుంది. ఇలాంటి సమాచారం కోసం మనం ప్రత్యేకంగా సమయం వెచ్చించకుండానే తెలుసుకోవచ్చన్నమాట. బస్సులు, రైళ్లు, ఆస్పత్రులు, వైద్యులు, హోటళ్లు, కీలకమైన వ్యక్తుల అపాయింట్ మెంట్లు.. ఇలా అనేక రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 

పిల్లలకు వచ్చిన ఇబ్బందేంటి?
దీని అవసరాన్ని పెద్దలు ఎఫెక్టివ్ గా వాడుకుంటుండగా.. పిల్లలకు మాత్రం ఇదో ఆటబొమ్మలా కనిపిస్తోంది. కొందరు గడుగ్గాయిలైతే డిజిటల్ అసిస్టెంట్స్ ని.. అన్నీ తెలిసిన సేవకుడిలా వాడుకుంటున్నారు. స్కూల్లో ఇచ్చిన హోం వర్క్ ను కూడా డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా పూర్తి చేసుకుంటున్నారు. అయితే అవి ముక్తసరిగా ఒకటి లేదా రెండు మాటల్లోనే జవాబులు చెప్తాయి కాబట్టి.. వివరణాత్మకంగా రాయాల్సిన జవాబులకు ఎలా స్పందించాలో పిల్లలకు తెలియడం లేదు. కేవలం లెక్కలకు సంబంధించిన ఆన్సర్స్ మినహా.. సోషల్, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో అసంపూర్తి లేదా అబద్ధపు సమాచారాన్నే డిజిటల్ అసిస్టెంట్స్ ఇవ్వగలుగుతున్నాయి.  ప్రతి హోం వర్క్ కూ ఇలా డిజిటల్ అసిస్టెంట్స్ మీద ఆధారపడటం వల్ల పిల్లల్లో పేపర్, పెన్నుతో పని చేసే స్వభావం తగ్గిపోయి అసలు సృజనాత్మక శక్తినే కోల్పోయేలా చేస్తున్నాయని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక పిల్లలు వాయిస్ ద్వారా కమాండ్ ఇస్తే అది పెద్దల చెవిన పడి వారు గమించే వీలైనా ఉంటుంది... అదే టెక్స్ట్ కమాండ్ ఇచ్చినట్టయితే.. వారేం టెక్స్ట్ కొట్టారు, ఏ సమాచారం అడిగారు, వచ్చిన రిప్లయితో వారేం చేయబోతున్నారనేది పెద్ద సమస్యగా మారింది. ఆకతాయితనంతో ఏదైనా అనుకోని కమాండ్ ఇస్తే.. ఎదురయ్యే పరిణామాలు, ప్రమాదాలు ఎలా ఉంటాయోనని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఇప్పటికే చాలా మంది సాఫ్ట్ వేర్ కుటుంబాల పిల్లలు దీని మాయాజాలంలో పడిపోయారు. వారిని ఎలా బయటపడేయాలా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం కూడా డిజిటల్ అసిస్టెంట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిద్దాం.