ఆ క్రెడిట్ మ‌హేశ్‌కే ద‌క్కుతుంది: వంశీ పైడిపల్లి

ఆ క్రెడిట్ మ‌హేశ్‌కే ద‌క్కుతుంది: వంశీ పైడిపల్లి

67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జ్యురీ సభ్యులు అవార్డుల వివరాలు తెలిపారు. ప్రాంతీయ భాషా విభాగంలో తెలుగు సినిమాలైన నాని 'జెర్సీ, మహేష్ బాబు 'మహర్షి' సినిమాలకు జాతీయ అవార్డులు వరించాయి. జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా మహర్షి సినిమాకుగానూ రాజు సుందరం ఎంపికయ్యారు. మ‌హ‌ర్షి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించ‌గా దిల్‌రాజు, సి.అశ్వినీద‌త్‌, పి.వి.పి నిర్మించారు. ఈ చిత్రం జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌ రాజు మీడియాతో ముచ్చటించారు. 

ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ.. ‘గత ఏడాది మార్చి 22న లాక్డౌన్ ప్ర‌క‌టించిన‌ప్పుడు ఏమై పోతామో అనిపించింది. అయితే ఇప్పుడు ఇదే రోజున అవార్డులు రావ‌డంతో ఊపిరి వ‌చ్చిన‌ట్ల‌య్యింది. ఈ అవార్డును తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంకితం చేస్తున్నాను. ఈ సినిమా క్రెడిట్ మ‌హేశ్‌ బాబు గారికే ద‌క్కుతుంది. నేను నెరేష‌న్ ఇచ్చిన‌ప్పుడు ఆయ‌న హ్యాపీగా ఫీల్ అయ్యారు. వంశీ.. నువ్వు చెప్పిన‌ట్లుగా సినిమాను తెర‌కెక్కిస్తే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఆఫ్ మై కెరీర్ అవుతుంద‌న్నారు. అదే న‌మ్మ‌కంతో ముందుకెళ్లాం’ అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.