'వకీల్ సాబ్'తోనే దిల్ రాజు సోదరుడి కొడుకు!

'వకీల్ సాబ్'తోనే దిల్ రాజు సోదరుడి కొడుకు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'వకీల్ సాబ్' మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జనాల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే... ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో దిల్ రాజు దాదాపు పది చిత్రాలను లైన్లో పెట్టారు. వీటిలో దేనికి అదే ప్రత్యేకమైన సినిమా. అయితే... వీటన్నింటిలోకి సమ్ థింగ్ స్పెషల్ అనిపించే మూవీ వేరొకటి ఉంది. అదే 'రౌడీ బోయ్స్'. దిల్ రాజు సోదరుడు, ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి తనయుడు ఆషిష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. అనుపమా పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని, మది సినిమాటోగ్రఫీని అందించారు. తొలి చిత్రం 'హుషారు'తోనే ప్రేక్షకులలో హుషారును రేకెత్తించిన హర్ష ఈ 'రౌడీ బోయ్స్'ను డైరెక్ట్ చేశాడు. నిజానికి దీనికంటే ముందే మూడేళ్ళ క్రితం ఆషిష్ తో దిల్ రాజు, శిరీష్ 'పలుకే బంగారమాయేనా' పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తీయాలని అనుకున్నారు. కారణాలు ఏవైనా ఆ స్థానంలో 'రౌడీ బోయ్స్' వచ్చి చేరింది. తాజా ఖబర్ ఏమిటంటే... శుక్రవారం 'వకీల్ సాబ్' విడుదల కాబోతున్న సందర్భంగా దిల్ రాజు... తన సోదరుడు శిరీష్ తనయుడితో తీసిన 'రౌడీబోయ్స్'కు సంబంధించిన ఇంట్రో ప్రోమోను విడుదల చేయబోతున్నాడట. వరల్డ్ వైడ్ గా 'వకీల్ సాబ్' ప్రదర్శించే థియేటర్లలో ఈ ప్రోమోను ప్రదర్శిస్తారని తెలుస్తోంది. అయితే... దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వేచిచూడాల్సి ఉంది.