స్పెషల్ ఇంటర్వ్యూ: భీమనేని శ్రీనివాసరావ్ - రిలీఫ్ కోరుకుని మా సినిమాకి వస్తే 100 % మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం !

స్పెషల్ ఇంటర్వ్యూ: భీమనేని శ్రీనివాసరావ్ - రిలీఫ్ కోరుకుని మా సినిమాకి వస్తే 100 % మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం !

అల్లరి నరేష్ తో 'సుడిగాడు' లాంటి హిట్ సినిమా తీసిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావ్ నరేష్ తో కలిసి చేసిన మరొక చిత్రం 'సిల్లీ ఫెలోస్'.  సునీల్ కూడ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఎన్టీవీ ఆయనతో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం... 

శ్రీనివాసరావ్ గారు చెప్పండి.. మీ 'సిల్లీ ఫెలోస్' ఎలా ఉండబోతుంది ?

ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.  ఇందులో ఉండే కొత్త తరహా కామెడీ అందర్నీ  తప్పకుండా నవ్విస్తుంది.  ఇందులో నరేష్ ప్రధాన పాత్రలో, సునీల్ ఒక కీలక పాత్రలో నటించారు.  ఈ చిత్రం తప్పకుండా మా అందరికీ కావాల్సిన విజయాన్ని అందిస్తుందనే నమ్మకం నాకుంది. 

'సుడిగాడు' లాంటి హిట్ సినిమా తర్వాత నరేష్ తో మీరు చేసిన సినిమా ఇది.  అంచనాలు బాగానే ఉన్నాయి.  వాటిని అందుకోడానికి ఎలా వర్క్ చేశారు ? 

అవును 'సుడిగాడు' తర్వాత మా కాంబినేషన్లో వస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు తప్పకుండా  ఉంటాయి.  చాలా ఏళ్ల నుండి మేమిద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.  అంచనాల మూలంగా ఈసారి ఇవ్వబోయే సినిమా ఇంకా బాగుండాలని మంచి కథను తయారుచేసుకోవడం కోసం ఇన్నాళ్లు ఆగాం.  మధ్యలో 'సుడిగాడు-2' చేద్దామనే ఆలోచన కూడ వచ్చింది.  చివరికి 'సిల్లీ ఫెలోస్' అనే ఈ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.  సుడిగాడులో స్పూఫ్ కామెడీ ఎక్కువగా ఉంటే ఇందులో మాత్రం సిట్యుయేషనల్ కామెడీ ఎక్కువగా ఉంటుంది. 

ఇది రీమేక్ సినిమానా లేకపోతే స్ట్రయిట్ సినిమానా ?

దీని బేస్ లైన్ వేరే దగ్గర్నుండి తీసుకున్నదే.  దాన్ని మన తెలుగు వాళ్లకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి మంచి కథ సిద్ధం చేసి సినిమా చేశాం. 

అసలు సినిమా కథేమిటి ?

ఇందులో హీరో నరేష్ ఒక ఎంఎల్ఏ కి అనుచరుడిగా ఉంటాడు.  అతనిలానే ఎదగాలని అనుకుంటాడు.  ఆ ఎదిగే ప్రయత్నంలో అతను ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు, వాటి నుండి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. 

ట్రైలర్లో ఈ కథేం రివీల్ చేయలేదు.   అంటే సస్పెన్స్ ఏమైనా ఉంటుందా ?

అలాంటిదేం లేదు.  సినిమా పూర్తిగా ఎంటెర్టైనింగా సాగిపోతుంటుంది.  మంచి ఫన్నీ పాత్రలు, మంచి కామెడీ ఉంటాయి.  

ఇందులో నరేష్, సునీల్ ఇద్దరికీ సమానమైన ప్రాముఖ్యత ఉంటుందా ? 

ఇందులో ప్రధాన పాత్ర నరేష్.  సునీల్ ది కూడ ముఖ్యమైన పాత్రే.  ఆయన పాత్ర ద్వారానే పరిస్థితులకు తగ్గట్టు మంచి కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది.  ఇద్దరికీ ఇది మంచి సినిమా అవుతుంది. 

మీది చాలా లాంగ్ కెరీర్ కదా ఇన్నాళ్లు టైమ్ టు టైమ్ ఎలా అప్డేట్ అవుతూ వచ్చారు ?

ఇష్టమైన పని ఎప్పుడూ కష్టంగా ఉండదు.  నాకు తెల్సింది వచ్చింది సినిమాలు తీయడం లేదా చూడటం.  అదే చేస్తుంటాను.  అన్ని భాషల, అన్ని దేశాల సినిమాలు చూస్తుంటాను.  కథను చెప్పడంలో, టెక్నాలజీలో, ప్రేక్షకులు సినిమాను చూసే విధానంలో ఎలాంటి వస్తున్నాయో గమనిస్తుంటాను. ఆ మార్పులకి తగ్గట్టు నన్ను నేను అప్డేట్ చేసుకుంటుంటాను. 

చాలా మంది అనుకుంటారు రీమేక్ అంటే చాలా ఈజీ అని.. దాని మీద మీ అభిప్రాయం ?

నేను మొదట్లో రెండు రీమేక్ సినిమాలు చేయడం, అవి హిట్టవడంతో నా దగ్గరకు ఎక్కువగా అలాంటి  సినిమాలే వచ్చాయి.  రీమేక్ సినిమా చేయడం అనుకున్నంత సులభం కాదు. ఈ సంగతి నేను చాలాసార్లు చెప్పాను.  ఒక సినిమాను రీమేక్ చేయాలనుకుంటే అందులోని సోల్ మిస్సవకుండా జాగ్రత్తపడాలి.  అందులో మనవాళ్లకు నచ్చేలా మార్పులు చేయాలి.  ఇలాంటివి చాలా పరిమితులుంటాయి.  ఎంతో ఆలోచించి పనిచేయాలి.  నిజానికి నేను చేసిన కొన్ని సినిమాల కథలు ఒరిజినల్ వెర్షన్ కథలకంటే బెటర్ గా ఉంటాయి.  

హీరోయిన్ చిత్ర శుక్ల గురించి చెప్పండి ?

ఆమె క్రమశిక్షణ, పని పట్ల శ్రద్ద కలిగిన అమ్మాయి.  సెట్లో సీనియర్ నటుల్ని చాలా గౌరవిస్తుంది.  భాష రాకపోయినా నేర్చుకుని చాలా సన్నివేశాల్ని సింగిల్ టెక్లో చేసేసేది.  మరొక హీరోయిన్ నందిని రాయ్ పాత్ర కూడ ఇందులో కీలకంగా ఉంటుంది.  ఆమె కూడ బాగా చేసింది. 

మీ నిర్మాతల సహకారం ఎలాంటిది ?

మా నిర్మాతలు భరత్, కిరణ్ లు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళు.  నేను కథ చెప్పి, ఇందులో హీరో నరేష్ అనగానే పాజిటివ్ గా స్పందించి సినిమా చేశారు.  ఒక దర్శకుడికి ఏం కావాలో అన్నీ ఇచ్చారు.  ఈ సినిమా మంచి విజయం సాధించి వారికి హ్యాట్రిక్ హిట్టివ్వాలని కోరుకుంటున్నాను. 

భవిష్యత్తులో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలేమైనా ఉన్నాయా ?

ప్రస్తుతానికి అలాంటివేం లేవు.  ఏదైనా ఈ సినిమా విజయాన్ని బట్టే ఉంటుంది.  ప్రస్తుతం ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసే పరిస్థితి లేదు.  ఈ సినిమా విడుదల తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను. 

కొత్త తరం దర్శకులకి ఒక సీనియర్ గా ఎలాంటి సలహా ఇస్తారు ?

నేను సలహాలిచ్చేంత గొప్పవాడ్ని కాదని అనుకుంటున్నాను (నవ్వుతూ).  ఇక్కడికి ఎప్పుడొచ్చాం అనేది ముఖ్యం కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం.  ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా మన పని మనం చేస్తూ ముందుకువెళ్లాలి.  అదే నా ఫార్ములా.  

చివరగా పేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ?

రోజువారీ జీవితంలో రకరకాల సమస్యల్ని చూస్తుంటాం.  వాటన్నిటి నుండి రిలీఫ్ కావాలని మా సినిమాకి వస్తే 100 % మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. లాజిక్స్ గురించి పట్టించుకోకుండా కుటుంబం మొత్తం కూర్చుని నవ్వుకుంటూ మా ఈ 'సిల్లీ ఫెలోస్' సినిమా చూడొచ్చు.