ఆస్కార్ రవిచంద్రన్ కు శంకర్ లేఖాస్త్రం

ఆస్కార్ రవిచంద్రన్ కు శంకర్ లేఖాస్త్రం

ఇటీవల ఆస్కార్ రవిచంద్రన్ 'అన్నియన్' చిత్రానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'అన్నియన్' తెలుగులో 'అపరిచితుడు' పేరుతో అనువాదమై ఇక్కడ కూడా విశేష ఆదరణ పొందింది. 'అన్నియన్' కథాహక్కులు తన సొంతమని కూడా రవిచంద్రన్ ప్రకటించడంపై దర్శకుడు శంకర్ తీవ్రంగా ఆక్షేపించాడు. ఈ విషయంపై నేరుగా ఆస్కార్ రవిచంద్రన్ కే శంకర్ ఘాటుగా ఓ లేఖ రాశాడు. 

అసలు 'అన్నియన్' స్టోరీ హక్కులు మీవి అని చెప్పుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోందని శంకర్ పేర్కొన్నాడు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం తన పేరునే ప్రకటించుకున్నానని, తాను ఎవరి కథనూ తీసుకోలేదని 'అన్నియన్' తన సొంత ఆలోచన నుండి పుట్టినదేనని శంకర్ స్పష్టం చేశాడు. అంతేకాదు, తన రచనలో మరొకరు జోక్యం చేసుకోవడాన్ని కూడా తాను సహించననీ తేల్చి చెప్పాడు. ఇక 'అన్నియన్' చిత్రానికి రచయిత సుజాత కేవలం సంభాషణలు మాత్రమే రాశారని గుర్తు చేశాడు. అలాగే మాటల రచయితగానే సుజాత పేరు టైటిల్స్ ప్రకటించామనీ తెలిపాడు. అంతే తప్ప, సుజాత కానీ, మరొకరు కానీ, 'అన్నియన్' కథలో వేలు పెట్టలేదనీ తేల్చి చెప్పాడు. అలాగే మీది కాని కథను మీది అని చెప్పుకోవడం కూడా భావ్యం కాదని శంకర్ ఆ లేఖలో పేర్కొన్నాడు. 

ఓ నిర్మాతగా మీరు ఆ సినిమా ద్వారా మంచి లాభాలను ఆర్జించారని ఆస్కార్ రవిచంద్రన్ కు లేఖలో గుర్తు చేశాడు శంకర్. నిరాధారపూరితమైన కథలు చెప్పి, తనకు, తాను తెరకెక్కించబోయే చిత్రాలకు నష్టం కలిగించరాదని శంకర్ కోరాడు. ఈ లేఖ చూసిన తరువాత మీలో సద్భావన కలుగుతుందని ఆశిస్తున్నానని శంకర్ పేర్కొన్నాడు. ఇకపై ఇలాంటి  అసత్య ప్రచారం మానుకొని మసలుతారని ఆశిస్తున్నట్టు శంకర్ తెలిపాడు. శంకర్ ఈ లేఖలో 'అన్నియన్' నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ సున్నితంగానే హెచ్చరించాడు. తనకు గానీ, తన రాబోయే ప్రాజెక్ట్స్ కు కానీ, ఇలాంటి డేమేజ్ చేసే వ్యాఖ్యలు చేసి నష్టం చేకూర్చరాదనీ కోరాడు. దీనిని బట్టి  'అన్నియన్' రీమేక్ ను రవిచంద్రన్ అడ్డుకునే ప్రయత్నం మానకుంటే, శంకర్ కోర్టుకు కూడా వెళ్ళటానికి సిద్ధమని ఈ లేఖ ద్వారా చెప్పకనే చెప్పాడన్నమాట.