ఇలా చెల్లిస్తే బాదుడే...

ఇలా చెల్లిస్తే బాదుడే...

పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు క్రమంగా వాటిలో కోత పెడుతోంది... ఇప్పటి వరకు పెట్రోల్‌ పంపుల వద్ద డిజిటల్‌ చెల్లింపులకు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని తగ్గించింది. పెట్రో బిల్లు మొత్తంలో 0.75 శాతం ప్రోత్సాహకాన్ని 2016 డిసెంబర్‌ 13 నుంచి ఇస్తుండగా... ఇప్పుడు దీనిని 0.25 శాతానికి తగ్గించాయి. పెట్రోల్‌ పంపు నిర్వాహకులకు కంపెనీలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా విషయాన్ని తెలిపాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని, ఈ విషయాన్ని కస్టమర్లకు తెలపాలని డీలర్లను కోరాయి. క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఈ–వ్యాలెట్ల ద్వారా చేసే చెల్లింపులకు ప్రస్తుతం ప్రోత్సాహకం లభిస్తోంది. 

లీటర్‌ పెట్రోల్‌పై 57 పైసలుగా ఉన్న క్యాష్‌బ్యాక్‌ 19 పైసలకు, డీజిల్‌పై 50 పైసల ప్రోత్సాహకం 17 పైసలకు తగ్గింది. వివిధ ప్రాంతాల్లో అమ్మకం ధర ఆధారంగా ఈ క్యాష్‌బ్యాక్‌ ఆధారపడి ఉంటుంది. పెట్రోల్ బంక్‌ల దగ్గర డిజిటల్ ప్రోత్సాహలకపై గతంలోనూ వివాదం నడిచింది. క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఈ–వ్యాలెట్ల ద్వారా జరిగే చెల్లింపులకు అదనంగా వసూలు చేసేందుకు పెట్రోల్ బంక్‌లు సిద్ధమైతే... ప్రజల నుంచి వ్యతిరేక రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని 0.75 శాతం ప్రోత్సహకాన్ని తామే ఇస్తామని ప్రకటించింది... దానిని ఇప్పుడు 0.25 శాతానికి తగ్గించేసింది. ఇక త్వరలోనే మిగిలన వాటికీ కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.