సభలో 'సీటు'పై రచ్చ..

సభలో 'సీటు'పై రచ్చ..

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీట్ల కేటాయింపు వ్యవహారం రచ్చరచ్చగా మారింది.. అచ్చెన్నాయుడు తన స్థానంలో కూర్చొకుండా చంద్రబాబు పక్కన కూర్చొంటున్నారని.. బుచ్చయ్య చౌదరికి కేటాయించిన సీటులో అచ్చెన్నాయుడు కూర్చొంటున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. దీంతో సీట్ల విషయంలో కూడా నిబంధనలు.. సంప్రదాయాల అంశాన్ని చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుగ్గన రెండోసారి ఎమ్మెల్యే అయ్యారని.. మరింత అనుభవం సంపాదించాలని సూచించారు చంద్రబాబు. దీంతో గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా.. జగన్ పక్కన తనకు కేటాయించిన స్థానంలో జ్యోతుల నెహ్రూను కూర్చొబెడితే యనమల తప్పుబట్టారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.. ఇదే అంశాన్ని ప్రశ్నిస్తే అనుభవం అంటారంటూ ఎద్దేవా చేశారు. సీటింగ్ విషయంలో రూలింగ్‍ ఇవ్వాలని స్పీకరును కోరారు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి... దీంతో, తనకు కేటాయించిన స్థానంలో అచ్చెన్న కూర్చునేందుకు అనుమతించాలని బుచ్చయ్య చౌదరి కోరారు. మరోవైపు ఈ వ్యహారంలో జోక్యం చేసుకున్న సీఎం వైఎస్ జగన్... ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. దీంతో అసెంబ్లీలో సీట్లపై చర్చ రచ్చరచ్చగా మారింది.