దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. మృతదేహాల ఖర్చు తడిసి మోపెడు..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. మృతదేహాల ఖర్చు తడిసి మోపెడు..!

హైదరాబాద్‌ శివారు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి నలుగురి మృతదేహాలపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్ కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసును విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు... డెడ్‌బాడీలను గాంధీ ఆస్పత్రిలోనే భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు మృతదేహాలు చెడిపోకుండా గాంధీ ఫోరెన్సిక్ నిపుణులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక ఫ్రీజర్లలో ఉంచి ఎంబామింగ్ చేస్తున్నారు. ఎంబామింగ్‌ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తున్నారు. దీంతో పాటు ఆస్పత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. ఒక్కో మృతదేహానికి రూ. 7500 విలువైన ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్ ఇస్తే మృతదేహం పాడవకుంటా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

ఇక, ఈ ఇంజక్షన్లతో 4 నెలల పాటు మృతదేహాలు పాడవ్వకుండా ఉంటాయి. కానీ, వారానికి ఒకసారి ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని ప్రత్యేకంగా తెప్పించి ఇస్తున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల ఇచ్చేంత వరకు మృతదేహాలను ఇలాగే భద్రపరచాల్సి ఉంది. నిందితుల మృతదేహాల అప్పగింతకు సంబంధించి, సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దిశను నరకం చూపించి ఆ తర్వాత దహనం చేసిన ఆ నలుగురు... సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో.. పోలీసులపై దాడి చేస్తూ పారిపోతున్న సమయంలో ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఆ నలుగురు నిందితులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే.