డీకే అరుణ సంచలన ఆరోపణలు

డీకే అరుణ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన డీకే అరుణ.. జైపాల్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె 'ఎన్టీవీ'తో మాట్లాడుతూ 'జైపాల్ రెడ్డి జనతాదళ్‌ను బొంద పెట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్‌ను బొంద పెట్టే పనిలో పడ్డారు' అని ఆరోపించారు. జైపాల్ రెడ్డి ఒక మేధావి అని.. ఆయన సలహాలతో ఉత్తమ్ పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్‌ బలహీనపడడానికి, నేతలు పార్టీలు మారడానికి కారణం వారేనని చెప్పారు. జిల్లాలో తనకు వ్యతిరేకంగా వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, చిన్నారెడ్డిలతో ఉత్తమ్‌ ఒక గ్రూప్ తయారు చేశారని.. వారితో తనకు వ్యతిరేకంగా మాట్లాడించారని ఆరోపించారు. 

తాను పీసీసీ చీఫ్‌ రేస్‌లో ఉన్నందునే తనపై ఉత్తమ్‌ కక్ష కట్టారన్న అరుణ.. చాలా మంది కాంగ్రెస్ నేతలు తనకు ఫోన్ చేసి మంచి నిర్ణయం తీసుకున్నానని చెప్పారని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి ఇంటికి ఉత్తమ్‌ వెళ్లారని.. కానీ పార్టీ మారొద్దని చెప్పలేదని అరుణ వివరించారు. టీఆర్‌ఎస్‌లో చేరమని ఆఫర్‌ వచ్చిందని.. కానీ ఆ పార్టీపై పోరాడిన తాను మళ్లీ అందులో ఎలా చేరుతానని ప్రశ్నించారు.  

కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం కంటే ఎక్కువ గౌరవాన్ని ఇస్తామని బీజేపీ నేతలు చెప్పారన్న అరుణ.. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. కాంగ్రెస్‌లో ఎన్నో గ్రూప్‌ల మధ్య పని చేసిన తనకు బీజేపీలో కొనసాగడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఇక.. బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయను అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు.