నేను ఏ తప్పూ చేయలేదు.. నో టెన్షన్..!

నేను ఏ తప్పూ చేయలేదు.. నో టెన్షన్..!

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ నేతలను సీబీఐ, ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. కీలకంగా ఉన్న వాళ్లను టార్గెట్‌గా చేసి ఈడీ పనిచేస్తోందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా మరోసారి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన శివకుమార్‌ స్పందిస్తూ.. తాను ఏ తప్పు చేయలేదని.. కార్యకర్తలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదని ధైర్యాన్ని చెప్పారు. ఆందోళన వద్దు.. అసలు టెన్షన్‌ పడాల్సిన పనేలేదు.. నేను ఏ తప్పూ చేయలేదు. అత్యాచారం, డబ్బులు తీసుకోవడం లాంటి నేరాలకు పాల్పడలేదని కాస్త ఘాటుగానే స్పందించిన డీకే.. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేవని.. నిన్న రాత్రి ఈడీ సమన్లు ఇచ్చింది.. ఇవాళ అధికారుల ఎదుట హాజరుకావాలని తెలిపారని తెలిపారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న ఆయన.. చట్టాన్ని గౌరవించి ఈడీ అధికారులకు సహకరిస్తానని ప్రకటించారు. కాగా, రూ.8.59 కోట్ల క్యాష్‌ను గతంలో డీకే ఇంట్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పన్ను ఎగవేత, హవాలా బదిలీల ఆరోపణల కింద గతేడాది సెప్టెంబరులో ఆయనపై కేసు నమోదు చేసింది ఈడీ.