మీరు ఇంటికే పరిమితం..! కానీ, కరోనా ఇలా ఇంట్లోకి రావొచ్చు..?
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే మాట, అందరికీ ఒకే టెన్షన్.. అంతా కరోనా.. కరోనా.. దీని భయంతో అంతా వణికిపోతున్నారు.. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులతో పాటు.. మరణాలు కూడా పెరుగుతూనే వున్నాయి. దీంతో లాక్ డౌన్ ప్రకటించింది సర్కార్. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటిించాలి అనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం.. అంతవరకు బాగానే ఉంది. మీరు ఇంటికే పరిమితం అయ్యారు.. ఇక కరోనా దరిచేరదు అని రిలాక్స్ కావాల్సిన సమయం కాదు.. మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు మరింత సేఫ్ గా ఉండొచ్చు. కూరగాయలు, పండ్లు, పాల ప్యాకెట్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తిచె అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కరోనా వైరస్ బారినపడకుండా ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో అయితే లాక్డౌన్ను ప్రకటించాయో గుర్తించి ప్రతి ఒక్కరూ పాటించాలి...’ అని అంటున్నారు వైద్యులు.
ప్రధానంగా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరంతోనే వైరస్ బారినపడకుండా వుండేందుకు అవకాశముంది. ఈ వైరస్ బారినపడిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ ఆరు అడుగుల దూరం వరకు పడుతుంది. ఆ సమయంలో సమీపంలో వున్న వ్యక్తిపై ఈ తుంపర్లు పడితే అందులో వుండే వైరస్ నోరు, ముక్కు ద్వారా లోపలకు ప్రవేశిస్తుంది. అదేవిధంగా అతను తాకిన వస్తువులను ఇతరులెవరైనా పట్టుకుని, ఆ చేతులను నోట్లో లేదా ముక్కులో పెట్టుకుంటే వైరస్ వ్యాపిస్తుంది. ఆయా వస్తువులను బట్టి రెండు నుంచి 24 గంటల వరకు వైరస్ బతుకుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల ద్వారా కూడా వైరస్ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదు. కావున, వీలైనంత వరకు ఇంటిబయటే.. వేగంగా నీరు వచ్చే ట్యాప్ కింద వాటిని శుభ్రం చేసి కొంతసేపు ఎండలో ఆరబెట్టిన ఆ తర్వాతే ఇంట్లోకి తీసుకెళ్లడం మంచిది అని హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే ఆ వస్తువులపై ఒకవేళ వైరస్ వున్నా శుభ్రం చేసినప్పుడు పోయేందుకు అవకాశముంది అంటున్నారు. ఇక, ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు దాటితే ఏ వైరస్ అయినా బతికేందుకు అవకాశం లేదు. అయితే, ఈ వైరస్ స్వభావం, వ్యవహరించే తీరు ఎలా వుంటుందో తెలియదు. అయితే ఈ వైరస్ ఎండ తీవ్రత పెరిగే కొద్దీ చనిపోతుందని భావిస్తున్నాం అని చెబుతున్నారు. అయితే వైరస్ ఎండలో కాకుండా మనుషులు ద్వారా చల్లని ప్రదేశాలలోకి వచ్చేస్తేనే ప్రమాదం అంటున్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళుతున్నప్పుడు మాస్క్ ధరించడం మేలు అని చెబుతున్నారు. ఇక.. ఈ వైరస్ బారిన పడిన వారిలో నీరసం, పొడి దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం, కఫం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు వైద్యులు.
ఇక, కరోనా వైరస్ ప్రస్తుతం మొదటి దశలో వుందంటున్న వైద్యులు... వీటిలో నాలుగు దశలు ఉన్నాయి. మొదటి దశలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ ఉంటుంది. అయితే, వారిని గుర్తించి ఐసోలేట్ చేయడం ద్వారా వ్యాధిని నియంత్రించేందుకు అవకాశముంది. ఆ తర్వాత రెండో దశలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో దగ్గరగా వున్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు సోకే అవకాశముంది. ఈ స్టేజీలో ఇద్దరినీ క్వారంటైన్ చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశముంది. ఈ దశలోనే వైరస్ను నియంత్రించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్కు పిలుపునిచ్చాయని చెబుతున్నారు. ఇక, మూడో దశ... ఇది కొంత ఇబ్బందికరమైన దశగానే చెప్పాలి. దీనినే స్టేజ్ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని అంటారు. ఎవరి వల్ల, ఎప్పుడు, ఎక్కడ వైరస్ సోకిందనేది గుర్తించడం కష్టమవుతుంది. బాధితులను గుర్తించి ఐసోలేట్ చేయడం సాధ్యం కాదు. దీనివల్ల వైరస్ శరవేగంగా మరింత మందికి వ్యాప్తి చెందేందుకు అవకాశముంది. ఇకపోతే నాలుగో దశ.. ఈ దశకు వెళితే ప్రమాదకరమనే చెప్పాలి. వందలు, వేలాది కేసులు వస్తాయి. దీంతో పరిస్థితులు చేజారి, కంట్రోల్ చేయలేక, వైద్యం అందించలేని స్థితికి చేరుకుంటుంది అంటున్నారు వైద్యులు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)