పుల్వామా దాడి భయంకరమైంది: ట్రంప్

పుల్వామా దాడి భయంకరమైంది: ట్రంప్

పుల్వామా ఆత్మాహుతి దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. జైషే మహమ్మద్ జరిపిన ఉగ్రదాడిని భయంకరమైన పరిస్థితిగా ఆయన అభివర్ణిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంగళవారం వైట్‌హౌస్‌ ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.​ పుల్వామా ఉగ్రదాడి విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై చాలా నివేదికలు కూడా వచ్చినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై సరైన సమయంలో తాము మాట్లాడతామని తెలిపారు. దక్షిణ ఆసియా దేశాలైన భారత్‌, పాక్‌లు కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుందన్నారు. 

‘ఫిబ్రవరి 14 దాడి తర్వాత భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నానని, దీనిపై పలు నివేదికలను కూడా సేకరించాను.. దీనిపై సరైన సమయంలోనే వ్యాఖ్యానిస్తున్నారు.. ఒకవేళ ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే అద్భుతమేనని’ మీడియా అడిగి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే, ఆత్మాహుతి దాడి భయంకరమైన పరిస్థితి అని, దీనిపై తమకు నివేదిక ఉందని తెలిపారు. 
మరోవైపు, అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి సైతం మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తో తమకు బలమైన సంబంధాలున్నాయని, ఈ ఉగ్రదాడికి తమ సంతాపంతోనే సరిపెట్టబోమని, వారికి పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. అలాగే పాకిస్థాన్ సైతం ఈ కేసు విషయంలో దర్యాప్తునకు సహకరించాలని, బాధ్యులెవరైనా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో తాము మాట్లాడామని ఆయన స్పష్టం చేశారు.