కశ్మీర్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్

కశ్మీర్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్

భారత్-పాకిస్థాన్ మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ప్రకటించి తీవ్ర వివాదానికి దారితీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఇకపై కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకోకూడదని ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలన్న తన ప్రతిపాదన “ఇకపై లిస్ట్‌లో లేదు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబారి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. 

కాగా, గత నెలలో అమెరికా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి జులై 22న డొనాల్డ్ ట్రంప్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని భారత ప్రధాని తనను కోరినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర దుమారమే రేగింది.. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ కొట్టిపారేసింది. మోదీ, ట్రంప్‌ మధ్య కశ్మీర్‌ ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత కొంచెం మాట మార్చి కశ్మీర్‌ సమస్య భారత్‌, పాక్‌ ద్వైపాకిక్ష అంశమే.. అయితే ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కోసం మా సాయం కోరితే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని తెలిపారు ట్రంప్. ఇక, ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న భారత్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను రద్దు చేసింది. అయితే, కశ్మీర్‌ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేయకూడదనేది అమెరికా దశాబ్దాల నాటి విధానం. ఈ సమస్యను భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాత్రం అమెరికా ప్రోత్సహిస్తూ వస్తోందని హర్షవర్ధన్‌ ష్రింగ్లా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొత్తానికి కశ్మీర్ విషయంలో ట్రంప్ వెనుకడుగు వేశారు.