అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పు, లాభపడనున్న భారతీయులు

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పు, లాభపడనున్న భారతీయులు

సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన ఒక పథకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించనున్నారు. ఇందులో అర్హతలు, అత్యున్నత డిగ్రీలు, ఇంగ్లీష్ మాట్లాడటం, వృత్తపరమైన నైపుణ్యాలు ఉన్న విదేశీయులకి ఇమ్మిగ్రేషన్ సులభతరం చేయనున్నారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగంలోని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. 

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్రతిపాదనపై రిపబ్లికన్ పార్టీ నేతల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ట్రంప్ ఇందుకోసం తన సొంతపార్టీ సెనేటర్లను ఒప్పించగలిగినా నాన్సీ పెలోసీ నేతృత్వంలోని డెమోక్రాట్లు, ఇతర నేతలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో ఈ ఇమ్మిగ్రేషన్ ఒక కీలక అంశంగా మారుతోంది. అందువల్ల ట్రంప్ మానస పుత్రిక అయిన ఈ పథకం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం అర్హతలకు బదులు కుటుంబ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మార్పుతో వేలు, లక్షలాది సంఖ్యలో గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న భారత నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది. ట్రంప్ అల్లుడు జెరెడ్ కుష్నర్ ఈ కొత్త పథకం ప్రతిపాదించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, గ్రీన్ కార్డ్, చట్ట ప్రకారం శాశ్వత నివాస ప్రణాళికను కట్టుదిట్టం చేయడంపై ఈ పథకంలో దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుత వ్యవస్థ ప్రకారం 66 శాతం గ్రీన్ కార్డులు కుటుంబ సంబంధాలు ఉన్నవారికి కేటాయిస్తున్నారు. అర్హతల ప్రకారం కేవలం 12 శాతం మందికే ఇస్తున్నారు.