ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ టెన్షన్..! ట్రంప్ వార్నింగ్..

ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ టెన్షన్..! ట్రంప్ వార్నింగ్..

ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలతో పాటు మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని ఉద్దేశించి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికన్లపైనా, వారి ఆస్తులపై దాడులు జరిగితే ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయన్నారు. అమెరికా, ఐరోపా పట్ల ఖమైనీ కాస్త కఠినంగా మాట్లాడుతున్నారు. వారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ప్రజలు అనేక బాధలు అనుభవిస్తున్నారు. ఆయన కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి.. అని ట్విటర్‌ ద్వారా ఖమైనీని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని వీడి ఇరాన్ ను గొప్పదేశంగా మార్చే విషయంపై దృష్టి పెట్టమంటూ హితవు పలికారు. 

మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ.. తన ట్విట్టర్ ద్వారా అమెరికాపై విరుచుకుపడ్డారు. ఇరాన్ ప్రజలకు అండగా ఉంటున్నామంటూ అమెరికా అబద్దాలాడుతోందని మండిపడ్డారు. ఒకవేళ మీరు ఇరాన్ ప్రజలతో కలిసి ఉన్నా.. అది వారి గుండెల్లో విషపు కత్తులతోపొడిచి చంపడానికే అన్నారు. ఇప్పటికే ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. ఇక ముందు కూడా ఓటమిపాలవుతూనే ఉంటారన్నారు. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ అణుఒప్పందాలపైనా ఖమైనీ విరుచుకు పడినట్లు సమాచారం. మీరు దశాబ్దాల నుంచి మాపై ఆంక్షలు విధిస్తున్నా.. వాటిని తట్టుకునే నిలబడ్డామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ తెలిపారు. మొత్తానికి దాడులు, ప్రతి దాడుల తర్వాత ఉద్రిక్తతలు కొనసాగుతుండగా... ఇప్పుడు ఇద్దరి వ్యాఖ్యలు మరింత టెన్షన్ వాతావరణాన్ని సృష్టించేలా ఉన్నాయంటున్నారు.