భారీగా ఎన్నికల బాండ్ల కొనుగోలు

భారీగా ఎన్నికల బాండ్ల కొనుగోలు

దేశంలో గత 14 నెలల్లో రూ.5,800 కోట్లకు పైగా ఎన్నికల బాండ్లను దాతలు కొనుగోలు చేశారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు మార్చి 1, 2018 నుంచి మే 10, 2019 వరకురూ.5,800 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్టు ఒక ఆర్టీఐకి వచ్చిన జవాబు ద్వారా తెలిసింది. 

మొత్తం అమ్ముడైన బాండ్లలో 76 శాతం అంటే రూ.4,444.32 కోట్లు ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 10 మధ్య అమ్ముడయ్యాయి. ఈ సమయంలో లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు జవాబుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జవాబుతో ఈ విషయం తెలిసింది. 

కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ 2018 ప్రకారం ఎస్బీఐకి చెందిన 29 శాఖలు మాత్రమే 10 దశల్లో ఎన్నికల బాండ్లు జారీ చేయడానికి, నగదుగా మార్చడానికి అధికారం కలిగి ఉ్నాయి. మార్చి 1, 2018 మే 10,210 మధ్య ప్రజలు రూ.5,851.41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారు. వీటిలో రూ.1,407.09 కోట్ల విలువైన బాండ్లను అనామక దాతలు గత ఏడాది మార్చి 1, ఈ ఏడాది జనవరి 24 మధ్య కాలంలో మొదటి ఏడు దశల్లో కొన్నారు.

 రూ.1000, రూ.10,000, రూ. లక్ష, రూ.10 లక్షలు, రూ కోటి విలువలలో బాండ్లు ఉంటాయి. ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం గత రాష్ట్ర సాధారణ ఎన్నికలలో పోలైన ఓట్లలో 1 శాతం ఓట్లు తెచ్చుకున్న రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లు పొందవచ్చు.