నీటి అడుగున నిద్రించాలని ఉందా?

నీటి అడుగున నిద్రించాలని ఉందా?

సముద్రంలో జరిగిన పెళ్లిళ్లను చూశాం. అయితే నీళ్లలో కాసేపు జరిగే పెళ్లి తంతుల సంగతి పక్కనపెడితే.. తాజాగా సముద్రంలో కాపురాలు చేయించే కాన్సెప్టులు కూడా వచ్చేశాయి. మాల్దీవులలో ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రంలో నిద్రించే ఏర్పాట్లు చేశారు. ఏదైనా కాస్త వెరైటీగా చేసుకోవాలని భావించేవారిని సంతృప్తి పరచేందుకు కోన్రాడ్ దీవిలో "ద మురాకా" అనే హోటల్ నే నిర్మించారు. కోన్రాడ్ మాల్దీవ్స్ లోని రంగాలీ ఐలాండ్ లో హోటల్ కమ్ విల్లాను ఎంతో అద్భుతంగా, హై టెక్నాలజీ సాయంతో నిర్మించారు. 

ఈ హోటల్లో ఒక్క రాత్రి గడపాలంటే 50 వేల డాలర్లు పే చేయాలి. అంటే మన కరెన్సీలో 36 లక్షల 24 వేల రూపాయలు. అయితే కేవలం ఒక్క రాత్రికే ఉంటానంటే కుదరదు. ఈ అండర్ వాటర్ లగ్జరీ హోటల్ రెసిడెన్స్ లో కనీసం నాలుగు రాత్రుల ప్యాకేజీతో బుక్ చేసుకోవాలి.  4 రాత్రుల కోసం 2 లక్షల డాలర్లు చెల్లించాలి. అంటే కోటీ 44 లక్షల 96 వేల రూపాయలు సుమారుగా. 

మురాకా హోటల్ కమ్ విల్లాను రెండంతస్తుల్లో నిర్మించారు. కింది అంతస్తు పూర్తిగా నీటిలో ఉంటుంది. ఇందులో బెడ్ రూమ్, బాత్ రూమ్, డైనింగ్ హాల్ వంటివి ఉండగా.. పై అంతస్తు నీటి ఉపరితలంపై ఉంటుంది. పైన సూర్యుణ్ని, ప్రకృతిని ఆస్వాదిస్తూ సేద దీరవచ్చు. ఇక్కడ లివింగ్ రూమ్, హాల్, బెడ్ రూమ్, బాత్ రమ్, డైనింగ్, కాన్ఫరెన్స్ హాల్ వంటివి ఎంతో అద్భుతంగా కొలువుదీరి ఉన్నాయి. ఇందులో 5 స్టార్ రెస్టారెంట్ కూడా ఉంది. స్థానిక భాష అయిన ధివెహి లో మురాకా అంటే పగడం అని అర్థం. సముద్రంలో నిర్మించిన పగడపు రెస్టారెంట్ అన్నమాట.