వేడి టీ తాగడంతో కేన్సర్ వచ్చే అవకాశాలు రెట్టింపు

వేడి టీ తాగడంతో కేన్సర్ వచ్చే అవకాశాలు రెట్టింపు

వేడి వేడి చాయ్ పడితే వచ్చే కిక్కే వేరప్పా అనుకునే వాళ్లకి ఇది షాకింగ్ న్యూస్. చుర్రుమనిపించేంత వేడి టీ కానీ కాఫీ కానీ తాగితే కేన్సర్ వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. మీరు ఓ మోస్తరు వేడితో టీ, కాఫీలు తాగితే ఏం ఫర్వాలేదని కూడా పరిశోధకులు చెబుతున్నారు. 

రోజూ మీరు 140 డిగ్రీల కంటే ఎక్కువ వేడితో రెండు కప్పుల టీ తాగితే మీకు అన్నవాహిక కేన్సర్ రెట్టింపు అవుతుందని ది అమెరికన్ కేన్సర్ సొసైటీ అధ్యయనం స్పష్టం చేసింది. ఇక్కడ వేడి కీలకమని చెప్పింది. గత అధ్యయనాల్లోనూ వేడి టీకి కేన్సర్ కి సంబంధం ఉన్నట్టు పరిశోధకులు చెబుతూ వచ్చారు. కానీ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను నిర్ధారించడం మాత్రం ఇదే మొదటిసారి.

ఇరాన్ లోని 50,000 మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అక్కడివారు అమెరికాలో కంటే ఎంతో అత్యధిక ఉష్ణోగ్రతలతో టీ తాగుతున్నట్టు గుర్తించారు. ఉష్ణోగ్రత అన్నవాహికను దెబ్బ తీస్తుందని, పదేపదే గాయాలు కావడం కారణంగా కేన్సర్ కి దారి తీస్తుందని భావిస్తున్నారు. దీనికి పొగ తాగడం, మద్యం సేవించడం, యాసిడ్ రిఫ్లక్స్ లలో మాదిరిగానే ఇది జరుగుతోందని చెబుతున్నారు.

ఏదైనా వేడి పదార్థాన్ని స్వీకరించినంత మాత్రానే అన్నవాహికకు గాయం అవుతుందని, దీంతో కేన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కి చెందిన నిపుణుడు సైతం అంటున్నారు. సాధారణంగా వేడి ద్రవాల కారణంగా కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ కూడా తెలిపింది.